రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ నిధులపై నిర్లక్ష్యం

Date:12/02/2019
అనంతపురం ముచ్చట్లు:
రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌) నిధులపై నిర్లక్ష్యం నెలకొంది. పాఠశాలలకు న్యాయబద్ధంగా అందే నిధులను కూడా అందుకోలేని దుస్థితి కొన్ని పాఠశాలల్లో నెలకొంది. ఆలస్యంగా మేల్కొన్నా ఇంకా ఫలితం ఊరిస్తూనే ఉంది. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా జిల్లాలోని 9, 10వ తరగతులకు పలు రకాల నిధులు మంజూరు చేస్తారు. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఉదాసీనతతో నిధుల్లేక విలవిల్లాడే ప్రమాదం ఏర్పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొన్ని పాఠశాలల తీరు నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ సర్వశిక్ష అభియాన్‌ ద్వారా 1 నుంచి 8వ తరగతి వరకు పలురకాల నిధులు మంజూరు చేస్తారు. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా 9, 10 తరగతుల్లోని విద్యార్థుల సౌకర్యార్థం నిధులు అందజేస్తారు. వాటితో పాటు బాలికల ఆత్మరక్షణ, ఫర్నీచర్‌ సౌకర్యం, అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవగాహన తరగతులు, ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా సౌకర్యాలు, పలు ప్రాంతాలను సందర్శించడానికి విద్యార్థులు విహారయాత్ర, ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు, సౌకర్యాలు, పాఠశాల నిర్వహణకు నిధులు సమకూర్చుతారు.
ఈ క్రమంలో ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతా నంబర్లు అందివ్వడంలో నెలకొన్న తప్పిదాలు నిధులు అందకుండా పోతున్నాయి. ఎక్కువగా ఉన్నతీకరించిన పాఠశాలలకే ప్రతిబంధకంగా మారింది. కనీసం సకాలంలో ఖాతాలు అందివ్వలేకపోవడం, పలు వివరాలు సమకూరకపోవడంతో ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి రావాల్సిన నిధులు అందడం లేదు. జిల్లాలో ఆర్‌ఎంఎస్‌ఏ పరిధిలో మొత్తం 619 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఇటీవల మొదటి విడతగా రూ.1,74,75,000, రెండో విడతగా రూ.1,74,75,000 నిధులు ఆయా పాఠశాలల ఖాతాలకు జమ అయ్యాయి. కేవలం 600 పాఠశాలలకు మాత్రమే పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు అయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.30 వేలు చొప్పున నిధులు జమ చేశారు. సక్రమంగా ఖాతాలు ఇవ్వని 9 పాఠశాలలకు రూ.5.70 లక్షలు జమ కాలేదు. సకాలంలో ఎకౌంట్ వివరాలు అందివ్వకుండా ఉండటంతో ఈ దుస్థితి ఏర్పడింది. సమయం ముగిసిన అనంతరం ఖాతాల వివరాలు అందించినా ఫలితం లేదు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు సకాలంలో స్పందించి ఉంటే ఆర్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే నిధులు జమ అయ్యేవి. పాఠశాల నిర్వహణకు నిధుల్లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దాపురించింది.
Tags:Rashtriya Madhyamika Shiksha Abhiyan neglected funds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *