భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు- వేడుకగా రథోత్సవం
– భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
తిరుపతి ముచ్చట్లు:

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.10 నుండి 8.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.
అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరావు, ఇఇలు శ్రీ మురళి కృష్ణ, శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ మల్లికార్జున ప్రసాద్, సుమతి, డెప్యూటీ ఇఇ శ్రీ దామోదరం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో మనోహర్, ఏఇ శ్రీ చంద్ర శేఖర్, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, వెంకటస్వామి, కంకణ బట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 19న చక్రస్నానం :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.40 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
Tags: Rathotsavam is a celebration of Devdev who has mounted the Manoratha of the devotees
