రవి ప్రకాష్ బెయిల్ పై  ఇవాళ విచారణ

Date:21/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

టీ9 ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రవిప్రకాశ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన యాజమాన్యం, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పలు కేసులు నమోదుచేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, రవిప్రకాశ్ హాజరుకాకపోవడంతో లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కావాలనే తప్పుడు కేసులు బనాయించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ పోలీసు స్టేషన్‌లలో వేర్వేరుగా నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ కోరారు. ఏబీసీఎల్‌ మార్పునకు సంబంధించిన వివాదంలో భాగంగా దురుద్దేశాలతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఏబీసీఎల్‌ను అలందా మీడియాకు అప్పగించే విషయమై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశానని ఆయన వెల్లడించారు. ఇందులో అభ్యంతరాలను లేవనెత్తకుండా తనను భయపెట్టడానికే ఈ కేసులు పెట్టారని రవిప్రకాశ్ వివరించారు. అంతేకాదు కొత్తగా నియమితులైన డైరెక్టర్లు చట్టప్రకారం కొనసాగడానికి వీల్లేదని అందులో పేర్కొన్నారు.

 

 

 

 

 

డైరెక్టర్ల పేర్లను మార్చడానికి ఏబీసీఎల్‌ మాజీ కంపెనీ సెక్రటరీ దేవేందర్‌ అగర్వాల్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి భయపెట్టే ప్రయత్నం చేశారని, అవి ఫలించకపోవడంతో తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన తెలిపారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, పాత తేదీతో పత్రాలు సృష్టించినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఎన్‌సీఎల్‌టీలో తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే పలు కేసులు నమోదు చేస్తున్నారని రవిప్రకాశ్ ఆరోపించారు. ఎలాగైనా తనను అరెస్ట్‌ చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఈ కేసులు నమోదు ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏయే సందర్భాల్లో ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చన్న అంశాలపై సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన పలు తీర్పులను పిటిషనర్ ప్రస్తావిస్తూ తనకు కూడా ఇదే ప్రాతిపదికన బెయిలు మంజూరు చేయాలని కోరారు. న్యాయస్థానం విధించే షరతులకు తాను కట్టుబడి ఉంటానని, పోలీసుల దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. రవిప్రకాశ్ దాఖలుచేసి పిటిషన్‌లపై మే 22న విచారణ జరిగే అవకాశం ఉంది.

 

సన్నాఫ్ ఆఫ్ శ్రీ హరి రీల్ ఎంట్రీ

Tags: Ravi Prakash bail hearing today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *