Rayalaseema University is the center of clashes

ఘర్షణలకు కేంద్రంగా మారుతున్న రాయలసీమ విశ్వవిద్యాలయం

Date:09/12/2019

కర్నూలు ముచ్చట్లు:

ఉజ్వల భవితకు చిరునామాగా నిలవాల్సిన రాయలసీమ విశ్వవిద్యాలయం ఘర్షణలకు కేంద్రంగా మారుతోంది. కొందరు విద్యార్థులు అనవసర విషయాల్లో తలదూర్చి తమ జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఆందోళన చెందుతుండగా.. మరికొందరు విద్యార్థులు బయటకు వెళ్లిపోతున్నారు. పరిస్థితిని అదుపులో పెట్టి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు చేపట్టాల్సిన ఉప కులపతి, రిజిస్ట్రార్‌ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సాంకేతికపరంగా ఘన చరిత్ర కలిగిన వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉప కులపతి, రిజిస్ట్రార్‌ గత నెలలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. అప్పటినుంచి ఇదే వర్సిటీలో ఉన్న సీనియర్‌ ప్రొఫెసర్‌కు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయిలో అధికారాలు లేకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఒకవైపు సమస్యలు పేరుకుపోతుండగా.. మరోవైపు అభివృద్ధి పనులు కానరావడం లేదు. మరోవైపు వర్సిటీ ఆవరణలోని వసతిగృహాలపై పర్యవేక్షణ కొరవడింది. ఇక్కడ పీజీ ఆర్ట్స్‌, సైన్సు కోర్సులు చేసేవారికి, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా వసతిగృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాన్‌ బోర్డర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలో ఉన్నతాధికారుల దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకొనేలోగా పెద్దల నుంచి సిఫార్సులు రావడంతో మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా పలువురు బయటి వ్యక్తులు వసతిగృహాల్లో తిష్టేశారు.

 

 

 

 

 

 

 

ఆర్‌యూ వర్సిటీలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరగడం సంచలనం సృష్టించింది. కొందరు విద్యార్థులు చదువులపై దృష్టి సారించకుండా ఇతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయ ఆవరణలోనే తాలూకా పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. వర్సిటీలో గొడవలు తగ్గించి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో అప్పటి ఉప కులపతి వై.నరసింహులు, రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటుకు కొంత స్థలాన్ని ఇచ్చారు. వర్సిటీ సమీపంలో స్టేషన్‌ ఉంటే విద్యార్థులు క్రమశిక్షణతో భయంగా ఉంటూ చదువుపై దృష్టి పెడతారన్న ఉద్దేశంతో అప్పటి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

 

 

 

 

 

 

 

 

గతంలో కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఎక్కువ గొడవలు చోటుచేసుకున్నాయని బోధన, బోధనేతర సిబ్బంది చర్చించుకుంటున్నారు. పట్టపగలే పరిపాలన భవనం వద్ద ఘర్షణలు జరుగుతున్నా పోలీసులు తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. చదువుకునే సమయంలో విద్యార్థులు, యువత తప్పటడుగులు వేస్తే వారి జీవితం నాశనమవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకులు కేసుల్లో ఇరుక్కుంటే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుందని పేర్కొంటున్నారు. ఉద్యోగాలు సాధించడం కష్టమవుతుంది. ఫలితంగా భవిష్యత్తు నాశనమవుతుంది. తల్లిదండ్రులు ఆశలు కల్లలవుతాయి. ఈ నేపథ్యంలో ఇకనైనా విద్యార్థులు చైతన్యవంతులవ్వాలి. ఘర్షణలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించడం ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మరోవైపు ప్రభుత్వం సైతం స్పందించి వర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల సమస్యలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

నత్తనడకన సాగుతున్న అమృత్‌ పథకం పనులు

 

Tags:Rayalaseema University is the center of clashes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *