రెడీ అవుతున్న కోత యంత్రాలు

Ready cutting machines
Date:23/11/2018
గుంటూరు ముచ్చట్లు:
వరి పంట కోతకు వచ్చింది. దీంతో రైతులు కోతలకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు యంత్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలోనే అన్నదాతలు కూడా సాగు పనులకు యంత్రాలను విరివిగా ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా భట్టిప్రోలు పరిధిలో కోత యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. పలు గ్రామాల్లో వరికోతలు దాదాపు ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కూలీల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు యంత్రాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. కూలీల సంఖ్య తగ్గినా.. పంట కోతలు సమయానికి ముగిసిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీలతో ఎకరం కోత కోయడానికి రూ.3వేల నుండి రూ.4వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే యంత్రంతో అయితే రూ.1200ల నుండి రూ.1500లకే పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో పలువురు రైతులు ఖర్చులు తగ్గించుకునేందుకు యంత్రాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
యంత్రంతో కోసిన ఓదెలు కూడా త్వరగా ఎండిపోయి కుప్పలు వేయడానికి అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. సకాలంలో వరి కుప్పలు వేసుకునేందుకు అవకాశంగా ఉంటుందనే కారణంతోనే తాము యంత్రాలపై ఆసక్తి చూపుతున్నామని చెప్తున్నారు. ఇదిలాఉంటే పంట కోతలకు సిద్ధమైనా రబీ సీజన్‌కు రెండవ పంటకు గానూ, ఏమి సాగు చేయాలో రైతులు ఇప్పటికీ నిర్ణయించుకోలేదు. ఏ పంటలు వేయాలనే విషయమై సందిగ్ధంలో ఉన్నారు. వ్యవసాయ విభాగం స్పందించి మంచి దిగుబడి వచ్చే పంటలు, విత్తన రకాలను సూచిస్తే వాటిని సాగు చేసుకుంటామని కొందరు రైతులు అంటున్నారు. మరోవైపు బోరు సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కొత్తగా మొక్కజొన్నకు కత్తెర పురుగు వ్యాపించిందని, దీనివల్ల జొన్న, మొక్కజొన్న మొక్క దశ నుండే పురుగు బారిన పడి దెబ్బతినే అవకాశం ఉందని మరికొందరు రైతులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈ అంశాలపై సంబంధిత అధికారులు కర్షకులకు అవగాహన కల్పించి రబీ సాగుకు తగిన సలహాలు, సూచనలు అందించాలని రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Ready cutting machines