విజయనగరంలో కొనసాగుతున్న రియల్ దందా

Date:18/09/2018
విజయనగరం ముచ్చట్లు:
 విజయనగరం జిల్లాలో ఇనాం భూములపై రియల్టర్లు కన్ను పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే భూములన్నీ ధారాదత్తం అయిపోతున్నాయి.  పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు, అడంగళ్లు ఇలా ఏ కాగితమూ లేని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది.విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చింతలవలస పంచాయతీ పరిధిలో రియలర్టర్లు చెలరేగిపోతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎప్పటి నుంచో వీరు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు.
మరోపక్క ఈ భూములకు సంబంధించి రైతులకు, మాన్సాస్‌ సంస్థకు మధ్య కోర్టు వివాదం ఏళ్లుగా నడుస్తుంది. అయినా ఇక్కడి భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇటీవల సర్వే నెంబర్‌ 172, 173, 178లోని గెడ్డలను కప్పేసి సుమారు 5 ఎకరాలకు పైగానే భూమిని లేఅవుట్‌లో కలిపేశారు. ఈ గెడ్డల ద్వారా నీరు రాకపోవడంతో గ్రామ పొలిమేరలో ఉన్న ఎర్ర చెరువులో నీరు లేక దాని ఆయకట్టు పరిధిలోని సుమారు 90 ఎకరాల పంటపొలాలు నాట్లకు దూరమయ్యాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమాల వెనుక గ్రామ సర్పంచ్‌తో పాటు ఎంపిటీసీ సభ్యుడు సహకారంతో రియల్టర్లు ఇనాం భూములతో పాటు చెరువుల్లోకి నీరు పారే గెడ్డలు, వాగులను కూడా ఆక్రమిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోపక్క రెవిన్యూ అధికారులు ఈ అక్రమాలపై పెదవి విప్పడం లేదు. ఇనాం భూముల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఆ భూములపై ఎవరికీ హక్కు లేదంటూనే  కబ్జాదారులకు సహకరిస్తున్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతులకు ప్రభుత్వ..రాయితీలు, రుణాలు ఇచ్చేందుకు మాత్రం రికార్డులు కావాలంటున్న అధికారులు,.అదే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కబ్జాలపై మాత్రం అడ్డుపడటం లేదు..  గెడ్డలు, పోరంబోకు, ప్రభుత్వ భూములే కాదు..చెరువు గర్భాలను వదలడం లేదు. గజం జాగా కనిపిస్తే చాలు..పాగా వేసేస్తున్నారు. కబ్జా వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటంతో పాటు దండిగా మామూళ్లు అందడంతో రెవిన్యూ అధికారులు కిమ్మనడం లేదు.
లేఅవుట్ల ముసుగులో అడ్డుగా ఉన్న గెడ్డలు, వాగులను కప్పేస్తుండటంతో చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి లేదు. ఫలితంగా ఆ చెరువుల కింద ఉన్న పంట పొలాలన్నీ బీడువారిపోతున్నాయి.చింతలవలస పంచాయతీలో ఎక్కువగా ఇనాం భూములే ఉన్నాయి. ఈ భూములకు అడంగళ్లు, టైటిల్‌ డీడ్‌లు, పట్టాపాసుపుస్తకాలు వంటి రికార్డులేమీ లేవు. కానీ..తాత తండ్రుల నుంచి స్థానిక రైతులు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారు.
Tags:Real Danda continuing in Vizianagaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *