Natyam ad

జనగామ జిల్లాల్లో రియల్ దందా

వరంగల్ ముచ్చట్లు:

జనగామ జిల్లాలో ఫామ్ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు మళ్లీ తెర లేపారు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై ఫామ్ ల్యాండ్ వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో జనగామ, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్, లింగాల గణపురం, బచ్చన్నపేట, నర్మెట మండలాల్లో ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఫామ్ ల్యాండ్స్ విక్రయాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో రియల్టర్లు వందల ఎకరాలను వెంచర్లుగా చేసి ఫామ్ ల్యాండ్స్ పేరుతో యథేచ్ఛగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందాలంటే ముందుగా నాలా అనుమతి పొందాలి. అంతే కాకుండా గ్రామపంచాయతీకి సదరు వెంచర్లో పదోవంతు పార్క్‌లో, ఇతర సౌకర్యాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రతి ఎకరంలో 10 గుంటలు ఎక్కడైతే వెంచర్ చేస్తారో ఆ గ్రామ పంచాయతీకి కేటాయించాల్సి ఉంటుంది.పైగా రోడ్డు వెడల్పు కనీసం 33 ఫీట్లతో చేపట్టాలి. మురుగు నీరు వెళ్లేందుకు డ్రైనేజీల సౌకర్యం, వీధిలైట్లు, నీటి సరఫరా, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వీటన్నింటికి అనుమతులు పొందాలంటే రియల్టర్లకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఖర్చు విషయం పక్కనపెడితే రోడ్ల కోసం, గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన స్థలం కోసం ఎక్కువగా భూమిని వదులుకోవాల్సి ఉంటుంది.

 

 

 

దీంతో వ్యాపారులు ఫామ్ల్యాండ్ ముసుగులో వెంచర్లను విచ్చలవిడిగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అధికారులు కూడా రియల్టర్లతో కుమ్మక్కై ఒక గుంట రిజిస్ట్రేషన్కు రూ.7 వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఎకరం ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్కు అధికారులకు రూ.4 లక్షల వరకు ముట్టజెబుతున్నారు. దీంతో అధికారులు కూడా రియల్టర్లకు సహకరిస్తూ తమ కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.అధికారులను ప్రసన్నం చేసుకుని ఫామ్ల్యాండ్రిజిస్ట్రేషన్ చేయడంతో రియల్టర్లకు అనుమతుల కోసం వెచ్చించే ఖర్చు భారీగా తగ్గింది. అలాగే ఒక్కో ఎకరం లో ఎక్కువ స్థలం విక్రయించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో రియల్టర్లు కూడా ఒక్కో గుంటకు రూ.10 వేల వరకు ముట్టజెప్పేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇందుకు నిదర్శనం జిల్లాలో ఇటీవల కాలంలో మీసేవ ద్వారా బుక్కైన స్లాట్ నెంబర్ బట్టి స్పష్టమవుతోంది. వీటిలో అధిక భాగం గుంట, రెండు గుంటలు, ఐదు గుంటల రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం.

 

 

 

Post Midle

ఆరు నెలల క్రితం నాలుగు బైనంబర్లుగా ఉన్న ఒక సర్వే నంబర్ ఆరు నెలల తర్వాత 20 బై నెంబర్లు గా విభజించబడి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయంటే ఫామ్ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏ మేరకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే అధికారులు మాత్రం ఫామ్ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెబుతున్న గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.జిల్లాలో యథేచ్ఛగా ఫామ్ల్యాండ్వ్యాపారం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. జనగామ జిల్లాలోని జనగామ, శామీర్ పేట, వడ్లకొండ, పెంబర్తి గ్రామాల్లో, రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు, కోమల్ల, గిద్దబండతండా, నిడిగొండ, చింతలగూడెం, శ్రీమన్ నారాయణ పురం, నర్మెట మండలం నర్మెట్ట, మచ్చుపహాడ్, లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల, లింగాల గణపురం, నవాబుపేట వడి చర్ల, పటేల్గూడెం, కళ్లెం, సిరిపురం, స్టేషన్ ఘన్పూర్ మండలంలోని స్టేషన్ఘన్పూర్, చాగల్లు వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా ఫామ్ల్యాండ్విక్రయాలు జరుగుతున్నాయి.

 

 

 

ఫామ్ల్యాండ్పేరిట వెంచర్లలో కేవలం రోడ్లు మాత్రం వేసి అన్ని అనుమతులు ఆ తర్వాత ఇస్తామని ప్రజలను నమ్మిస్తూ హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి కొనుగోలుదార్లను తీసుకువచ్చి ప్లాట్లను విక్రయిస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసిన గ్రామాల్లో ఆయా సర్పంచ్ లకు మామూళ్లు ముట్టజెప్పి పంచాయతీ అనుమతులు ఉన్నట్లుగా వారితో నమ్మ బతుకుతున్నారు.రియల్టర్లు స్వేచ్ఛగా ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. జిల్లాలో వందల కొద్దీ ఫామ్ల్యాండ్ వెంచర్లు ఉన్నా ఏ ఒక్క చోట గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే పరోక్షంగా ఆయా గ్రామాల సర్పంచులు నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. గ్రామ కార్యదర్శులు ఉన్నా కొన్ని చోట్ల వారు నామమాత్రంగా కాగా, మరికొన్ని చోట్ల వారికి మామూళ్లు ముట్టడంతో చూసీ చూడనట్లు గా వ్యవహరిస్తున్నారు.

 

 

 

దీంతో రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా ఫామ్ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తూ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.గిద్ద బండ తండా గ్రామాల్లో ఇటీవల కాలంలో సర్వేనెంబర్‌లు 71 నుంచి 80 వరకు ఒక్కో ఎకరం వందల బై నంబర్లుగా విడగొట్టి రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో జరుగుతున్న ఈ ఫామ్ల్యాండ్అక్రమ వ్యాపారం పై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే వ్యవసాయ భూములు ఫామ్ ల్యాండ్రూపంలో ఫ్లాట్ గా మారి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Real Danda in Janagama districts

Post Midle

Leave A Reply

Your email address will not be published.