ఉన్నత లక్ష్యాలను సాధించడమే నిజమైన సంతోషం
– ఎస్వీ ఆర్ట్స్ కళాశాలను సందర్శించిన టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:

విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడమే నిజమైన సంతోషమని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి విద్యార్థులకు చెప్పారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించిన సందర్భంగా సోమవారం ఆయన కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఈవో మాట్లాడారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకువచ్చేలా చదువుకోవడమే నిజమైన సంతోషమని ఆయన తెలిపారు. గురువులు తమ పాత్ర పరిపూర్ణంగా పోషిస్తున్నామా లేదా అని తమను తాము ప్రశ్నించుకుని శిష్యులను ఉన్నత శిఖరాలకు చేర్చేలా మార్గదర్శనం చేయడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి భవిష్యత్తులో ఏ ఉన్నత స్థాయికి చేరుకున్నా తమను గుర్తు పెట్టుకునేలా గురువుల పనితీరు ఉండాలన్నారు. గురుశిష్యుల బంధాన్ని మరింత పటిష్టం చేసి సమాజ ఉన్నతికి కృషి చేయాలని శ్రీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరచడం ద్వారా టిటిడి విద్యాసంస్థల్లో సీట్ల కోసం విపరీతమైన పోటీ ఉండే పరిస్థితి తీసుకురావాలన్నారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భగవద్గీత మానవ సమాజానికి సంబంధించిన ఒక సైన్స్ లాంటిదని, దీన్ని అర్థం చేసుకుని కొంతవరకైనా ఆచరిస్తే మంచి వారిగా తయారు కావచ్చన్నారు.
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది విద్యాసంస్థలను తమవిగా భావించి తరగతి గదులు, పరిసరాలు, హాస్టళ్లు, వంటగదులు శుభ్రంగా ఉంచుకోవడానికి శ్రమదానం చేయాలన్నారు. విద్యార్థులు మంచి ఉద్యోగం లేదా ఉపాధి పొందడానికి అవసరమయ్యే సివిల్ సర్వీసెస్, బ్యాంకులు, ఇతర అన్నిరకాల పోటీ పరీక్షలకు ఆసక్తిని బట్టి వారిని తయారు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ వపర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళాశాలలోని కోర్సులు, అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి కళాశాలలోని అన్ని ల్యాబ్‌లు, హాస్టల్ గదులు, వంటశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కళాశాల, వంటశాల ఆవరణంలోని నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.జెఈవో సదా భార్గవి, డిఇవో గోవిందరాజన్, ఎస్ఇ(ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, ఇఇ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Real happiness lies in achieving high goals
