గుబులు పుట్టిస్తున్న రెబల్స్ ఫ్రంట్

Date:17/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఆ పార్టీలో టికెట్లు దక్కని నేతలంతా కలిసి తెలంగాణ రెబల్స్ ప్రంట్ పేరుతో ఏకమై ఫ్రంట్‌గా తెరపైకి వచ్చారు.  మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఇంట్లో రెబల్స్   కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రెబల్స్ ఫ్రంట్‌లో భాగస్వామ్య సభ్యులందరితో ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించనున్నట్లు బోడ ప్రకటించారు.
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియాలు మహాకూటమి పేరుతో ఒక మాయ చేశారని బోడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకు టికెట్ ఇవ్వమని ఇచ్చారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని లేదంటే.. తామంతా కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి పోటీచేస్తామని హెచ్చరించారు. గురువారం 40 మందితో సమావేశమయ్యామని చెప్పారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీవాళ్లే ఉంటారని బోడ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, టీడీపీ ఇతర పార్టీల వాళ్ళు సంప్రదిస్తున్నారని చెప్పారు. మహాకూటమి పేరుతో 19మంది కొత్తవాళ్లకు టికెట్లు అమ్ముకున్నారని, వాళ్లంతా టికెట్లు కొన్నవాళ్లేనని బోడ దుయ్యబట్టారు. . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లోపంచిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొందరు నేతలు తమ అనుచరులకు టికెట్లు ఇచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.
ఎంపిక చేసిన జాబితా రాహుల్ గాంధీ సూచనమేరకే ఏర్పడిందా? అని సూటిగా ప్రశ్నించారు. ప్యారచూట్‌లకు టికెట్లు ఇవ్వొద్దన్నారని, కానీ వారికే టికెట్లు కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీలో ప్రాధమిక సభ్యత్వం లేనివాళ్లకు టికెట్లు ఎలా ఇచ్చారని? ధ్వజమెత్తారు. రౌడీ షీటర్లు, బ్యాంక్‌లను దోపిడీ చేసిన వాళ్లకు, సెటిల్మెంట్లు చేసేవాళ్లకు టికెట్లు ఇచ్చారని విజయరామరావు దుయ్యబట్టారు.
ధర్మపురి రవీందర్ మాట్లాడుతూ.. తూతూ మంత్రంగా టికెట్ల కేటాయింపు జరిగిందని మండిపడ్డారు. మూడు సార్లు ఓడిపోయిన వారిని, 30వేలు మెజారిటీ రాని వారిని ఎంపికచేయమన్నారని, కానీ ఎంపికచేశారని విమర్శించారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తానని కుంటి గుర్రాలను ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. తమ దగ్గర అడ్లూరి లక్ష్మణ్ నాలుగుసార్లు ఓడిపోయారని అయినా ఆయనకు టికెట్ వచ్చిందని ధర్మపురి ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: Rebels Front

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *