భక్తిభావంతో సాగిన అఖండ గీతా పారాయణం
తిరుపతి ముచ్చట్లు:
గీతా జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.ప్రముఖ వేదపండితులు కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల మొత్తం 700 శ్లోకాలను నాలుగు గంటలపాటు నిరంతరాయంగా పారాయణం చేశారు.అంతకుముందు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం మొదట్లో “అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో”, చివరగా “కృష్ణం వందే జగద్ గురుం” కీర్తనలను భావయుక్తంగా ఆలపించారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి, ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని, వేదపండితులు నరసింహాచార్యులు, మారుతి, రామానుజం, రాఘవేంద్ర, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Tags; Recitation of Akhanda Gita with devotion
