పట్టభద్రుల నియోజకవర్గాల ఓటు హక్కు నమోదు షురూ

Date:12/10/2018
కాకినాడ ముచ్చట్లు:
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటు హక్కు నమోదు ప్రక్రియను ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల యంత్రాంగం పెద్ద ఎత్తున చేపట్టింది. గోదావరి జిల్లాల్లోని అన్ని విద్యాశాఖ కార్యాలయాలు, మండల పరిషత్, తహశీల్దారు, పుర పాలక సంఘ కార్యాలయాల్లో ఓటు హక్కు నమోదు శిబిరాలను ఏర్పాటుచేశారు.
అర్హులైన పట్ట్భద్రులు సహా డిగ్రీ అర్హత కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ ఓటు హక్కు కలిగివుండాలని ప్రచారం చేస్తున్నారు. రానున్న గోదావరి జిల్లాల మండలి పట్ట్భద్రుల ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2015 అక్టోబర్ 30వ తేదీ లోపు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
అర్హులైన వారు ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఫారమ్-18 పూర్తిచేసి, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన డిగ్రీ ధ్రువీకరణపత్రం నకలు (గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించినది), అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు గుర్తింపు కార్డు వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను జత చేయాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని తహశీల్దారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
వచ్చే నవంబర్ 6వ తేదీలోగా పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఓటర్లుగా నమోదు కావల్సిన వారు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. గతంలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పేరు నమోదై ఉన్నవారు సైతం ప్రస్తుత ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, తూర్పు గోదావరి జిల్లా వెన్యూ అధికారి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు.
ఓటు హక్కు నమోదుకు కార్పొరేట్ విద్యా సంస్థల ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘాలు ఓటుహక్కు శిబిరాలను ఏర్పాటుచేశాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇరువురు కార్పొరేట్ విద్యా సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఓటుహక్కు నమోదు సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎన్నికల బరిలోకి దిగనున్న యూటీఎఫ్ ఆధ్వర్యంలోనూ ఓటర్ల నమోదు సహాయక శిబిరాన్ని కాకినాడలో ప్రారంభించారు.
Tags: Registering the right to vote for graduate constituencies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *