రెండేళ్లలో 56 శాతమే క్రమబద్దీకరణ

Date:17/09/2018
కరీంనగర్ ముచ్చట్లు:
స్థలాల క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల పరిష్కారం బద్దకిస్తోంది. దరఖాస్తులు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు.
రెండేళ్ల కాలంలో కేవలం 56 శాతం మాత్రమే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. అక్టోబర్‌ 31 వరకు గడువు ఉండగా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన కనబడుటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు చివరిసారిగా ఇచ్చిన గడువును దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకుంటే బల్దియాల కాసుల పంట పండనుంది.
ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా రూ.30.26 కోట్ల ఆదాయం రాగా, మొత్తం దరఖాస్తులు పరిష్కారమైతే మరో రూ.20 కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అయితే గడువు ఎన్నిసార్లు పొడిగించినా దరఖాస్తుదారుల్లో ఉత్సాహం కనబడడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చూపించిన ఉత్సాహం పరిష్కరించుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.
అయితే చివరిసారిగా పెంచిన గడువుతో మొత్తం దరఖాస్తులు పరిష్కారం అవుతాయనే ఆశాభావం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దరఖాస్తులన్నీ పరిష్కారానికి నోచుకుంటే బల్దియాకు కాసులపంట పండనుంది.2016 నవంబర్‌లో స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
రూ.10 వేల డీడీలను చెల్లించి 4368 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు గడువును పొడిగిస్తూ సుమారు రెండేళ్ల కాలం ఎదురుచూసింది. చివరిగా మరో అక్టోబర్‌ 30 వరకు గడువును పొడిగించింది.
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పలుమార్లు గడువు పొడిగించడంతోపాటు రెండు పర్యాయాలు బల్దియాలో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాను ఏర్పాటు చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి మూడు సార్లు నోటీసులు పంపించారు.
అయినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గడువులోపు మొత్తం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం అనుమానంగానే మారింది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకుంటే వీఎల్‌టీ కట్టాల్సి వస్తుండడంతో కొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి రావడం లేదు. మరికొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి ఫీజులు చెల్లించినప్పటికీ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో దరఖాస్తులను అధికారులు పరిష్కరించడంలేదు.
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు సంబంధించి ఫీజులు చెల్లించుకునే వరకే హడావిడి చేసిన అధికారులు ప్రొసీడింగ్స్‌ ఇచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా వేగం పెంచడం లేదు.
వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటుండడంతో దరఖాస్తుదారులు మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  ఇంకొందరైతే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ కోసం వేచి చూడలేక ఎలాంటి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇలా ఆలస్యం అక్రమాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
Tags: Regulation of 56% in two years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *