పునరావాస చర్యలు ముమ్మరం

Date:13/10/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులంతా శ్రీకాకుళం జిల్లాలో  ఉన్నారని, ఎప్పుడూ ఏ సహాయం కావాలన్న అంతా అందుబాటులోనే ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు అయన జిల్లాలోని పలాసలో అధికారులతో తుపాను పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించారు.  అధికారులు వెంటవెంటనే చర్యలు తీసుకోవాలని, సహాయ, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలన్నారు.
పలాస, ఉద్దానం ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావాలన్నారు. ప్రతి ఆస్పత్రి నుంచి ఐదు వైద్య బృందాలను పంపాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇంటింటికీ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. 196 గ్రామాలకు సంచార వైద్య వాహనాలను పంపాలని తెలిపారు. డయాలసిస్ సెంటర్లలో సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, అందరికీ నిత్యావసర సరుకులు, పాలు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డయాలసిస్ సెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
నిత్యావసర వస్తువులు, బియ్యం రెండు ప్యాకెట్లుగా పంపిణీ చేయాలని, చిన్నారులకు పాలు అందించాలన్నారు. చెరువులకు గండ్లు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 25 కిలోల బియ్యం, కిలో నూనె, కందిపప్పు, బంగాళాదుంపలు, అరకిలో పంచదార పింపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు సరుకులతో పాటు 50 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పారు.
మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి  ప్రకటించారు. పూర్తిగా ధ్వంసమైన పడవలకు రూ. 10 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ. 5 వేలు,   వలలకు రూ. 2,500 ఇస్తామన్నారు. , పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.  ప్రతిచోట్లా నోడల్ అధికారులు వున్నారని, క్షేత్రస్థాయిలో వారు పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Tags: Rehabilitation measures intensify

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *