KCR's goal is for farmers to grow

మళ్లీ జలజగడం

Date:21/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పినా సంచలనమే. ఏం చేసినా చర్చనీయమే. తాజాగా ఆర్థిక ప్యాకేజీపై ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో రగులుకుంటున్న జలవివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. ఏపీలో అధికారపక్షమైన వైసీపీ ఆత్మరక్షణలో పడకుండా ప్రతిపక్ష తెలుగుదేశానికి కళ్లెం వేసేశారు. మరోవైపు సొంత రాష్ట్రంలో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు యత్నించారు. మొత్తమ్మీద తన రాజకీయ నైపుణ్యాన్ని చాకచక్యంగా ప్రదర్శించారు. పోతిరెడ్డి పాడు వివాదంపై దాటవేత వైఖరితోనే దానిని టీ కప్పులో తుపానుగా చల్లార్చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన జలసిరులు కృష్ణా,గోదావరులు. ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి కృష్ణానీటిపై ఎప్పుడూ తగవులే. పొరుగు రాష్ట్రాలతోనే కాదు, ఒకే రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య సైతం రాజకీయ రచ్చ రగులుతూనే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత సెగ మరింత పెరిగింది.

 

 

 

అవసరమైతే ఏ రాష్ట్రంతో అయినా కృష్ణా నీటిపై కయ్యానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేసీఆర్ చెబుతున్నారు. గోదావరి నీళ్ల విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రాలన్నిటితోనూ స్నేహం కలుపుకుంటామంటున్నారు. మహారాష్ట్రతో గోదావరి విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వ్యతిరేకించకపోవడానికి కారణమదేనంటున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకువెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. కృష్ణా నీటి విషయంలో మాత్రం రాజీ పడమంటున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తో నూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ ఏర్పడిన చెలిమిని వదులుకునే ప్రసక్తి లేదంటున్నారు. ఈ రెండు పరస్పరం భిన్నంగా కనిపిస్తాయి. పోతిరెడ్డిపాడు విస్తరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ సర్కారు వైఖరేమిటని ప్రశ్నించినప్పుడు కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఏపీతో కలిసి పనిచేస్తున్నాం.

 

 

 

కలిసే ఉంటామంటూ చాలా వ్యూహాత్మకంగానే బదులిస్తున్నారు. ఇక్కడే ఉంది రాజకీయ మతలబు.పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల విషయంలో గతంలో ఏపీ, తెలంగాణ ల మధ్య పెద్ద వివాదమే నడిచింది. సుప్రీం కోర్టులోనూ ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. తర్వాత కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ దృష్టికి వెళ్లింది. అప్పుడు కుదిరిన ఒక అంగీకారాన్ని ప్రస్తుతం కేసీఆర్ ముందుకు తెస్తున్నారు. మాది మేము ..మీది మీరు చూసుకోండన్నట్లుగా అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుతో అవగాహనకు వచ్చామని చెబుతున్నారు కేసీఆర్. దీనివల్ల పాలమూరు – రంగారెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్, అలాగే పోతిరెడ్డి పాడు విస్తరణ విషయంలో తెలంగాణ సామరస్య పూర్వకంగా అనధికారికంగా అంగీకార ధోరణిలోనే ముందుకు వెళ్లే అవకాశాలున్నట్లు తేలిపోతోంది. తెలుగుదేశం పార్టీ సైతం పెద్ద రచ్చ రగులుతున్నప్పటికీ అధినేత స్థాయిలో ఇంతవరకూ పోతిరెడ్డిపాడుపై స్పందించలేదు. దీని వెనక కేసీఆర్ చూపుతున్న కారణముండవచ్చని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల అంశాన్ని పోతిరెడ్డిపాడుతో లింక్ చేయడం ద్వారా ఇరువైపులా ప్రతిపక్షాలను నియంత్రించాలనే ఎత్తుగడ కేసీఆర్ లో కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఢిఫెన్స్ లో పడిపోయింది.

 

 

 

ఇది అధికార వైసీపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మా కేటాయింపు నీళ్లే మేము వాడుకుంటామని గతంలో తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కు తేల్చి చెప్పేసింది. ఇప్పుడు పోతిరెడ్డి పాడు ద్వారా మా కేటాయింపులు మించి వాడుకోమంటూ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చింది. దీంతో ఈ వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోతోంది.ప్రతిపక్షాల రాజకీయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టినా తప్పులేదు. కానీ ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న సుహృద్భావాన్ని భవిష్యత్ ప్రయోజనాలకోసం వినియోగించుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టులో దశాబ్దాలుగా పూడిక పేరుకుపోతోంది.

 

 

 

 

ఇరు రాష్ట్రాలు నీటి తగాదాల్లో తలమునకలవ్వడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పూడిక కారణంగా ప్రతి ఏడాది 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని అంచనా. 300 టీఎంసీల నిల్వ కలిగిన ప్రాజెక్టు సామర్థ్యం ఇప్పటికే 210 టీఎంసీలకు పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు కు ఎగువన 120 కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వరం వద్ద ప్రత్యామ్నాయ నిర్మాణాలను చేపట్టి పూడిక తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చుననేది సూచన. డ్యామ్ భద్రత, నిల్వసామర్ధ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రధాన కర్తవ్యంగా రెండు రాష్ట్రాలు ముందుకు కదిలితేనే నీటిని సద్వినియోగం చేసుకోవడం సాధ్యమవుతుంది. లేకపోతే వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలు చేపట్టినా వృథా శ్రమగా నిష్ఫలమవుతాయి.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Tags: Rehydrate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *