హరితహారం ప్రారంభించేలోగా ముళ్లపొదల తొలగింపు 

-బీటీ, బస్సులు వెళ్లే రోడ్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
 – అధికారులతో మంత్రులు జూపల్లి తుమ్మల సమీక్ష
Date:22/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రహదారుల పక్కన ఇబ్బందికరంగా మారిన ముళ్లపొదలు, తుమ్మ చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ముళ్లపొదల తొలగింపుపై సచివాలయంలో మంగళవారం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్న 25 వేల కిలోమీటర్లతో పాటు పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 67 వేల 500 కిలోమీటర్ల రహదారుల పొడవునా ముళ్లపొదలు, తుమ్మ చెట్లను తొలగించేందుకు రేపటినుంచే రంగంలోకి దిగాలని అధికారులకు సూచించారు. ఇందులోను ప్రధానంగా బీటీ రోడ్లు, బస్సులు ప్రయాణించే రహదారుల పక్కన ఉన్న ముళ్లపొదలను ముందుగా తొలగించాలన్నారు. ఇందుకోసం జేసీబీ లను అద్దెకు తీసుకోవాలని, ఒక్కో జేసీబీ రోజుకు ఎన్ని కిలోమీటర్ల పొడవునా చెట్లను తొలగించగలదో అంచనా వేయాలన్నారు. ఇందుకోసం అవసమున్న చోట ఉపాధికూలీలను కూడా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలన్నారు.హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేలోగానే ముళ్లపొదల తొలగింపు పూర్తి అయ్యేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలన్నారు. 10, 15 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్ల విస్తరణకు ఉన్న అవకాశాన్ని గమనిస్తూ హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుంచుకొని, రోడ్డుకు కొంత దూరంలో మొక్కలు నాటాలన్నారు. ముళ్లపొదల తొలగింపుకు ముందు, తొలగించిన తర్వాత వీడియోలను తీసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, సునీల్ శర్మ, ఈఎన్ సీ లు సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రావు, గణపతి రెడ్డి, అధికారులు తిరుపతిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Removal of the hedgehogs before planting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *