ఏపీ రాజకీయాలపై రేణుకా దృష్టి

విజయవాడ ముచ్చట్లు:


రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం   దివంగత నందమూరి తారక రామారావు హయాంలో రేణుకా చౌదరి  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, రాజకీయంగా  ప్రత్యర్థులు ఎంతటివారైనా తన పదునైనా  వాగ్బాణాలతో  వెరుపులేకుండా విమర్శలు గుప్పించడం రేణుకా చౌదరి నైజం. అదే స్పీడును, అదే నిక్కచ్నితనాన్ని, అదే ధైర్యాన్ని ఆమె కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకా చౌదరి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు రేణుకా చౌదరి రెడీ అవుతున్నారని సమాచారం. ఏపీ రాజధాని అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని,  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  అమరావతి అంశాన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఏపీ ప్రజలకు సుపరిచితురాలైన రేణుకా చౌదరి చరిష్మా ఇందుకు బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఏపీలో రేణుకా చౌదరి పార్టీ సభలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏఐసీసీ ఓ సరికొత్త ప్రణాళికను రెడీ చేసిందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని రైతుల అమరావతి టూ అరసవిల్లి 2.O మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి రేణుకా చౌదరి హాజరయ్యారని చెబుతున్నారు. అమరావతి రైతులతో రేణుకా చౌదరి కొంతదూరం నడిచి మరీ వారికి మద్దతు తెలిపారు.

 

 

 

రైతులు కూర్చున్న ట్రాక్టర్ ను రేణుకా చౌదరి స్వయంగా డ్రైవ్ చేశారు.వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిందనే కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలు అనేక మంది తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఏపీలో అత్యంత దీన స్థితిలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ లైట్ హౌస్ మాదిరిగా కనిపించినట్లు చెబుతున్నారు.  రేణుకా చౌదరి సభల ద్వారా ఏపీలో మళ్లీ తన ఉనికిని రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రధాన నగరాల్లో రేణుకా చౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.అమరావతి టూ అరసవిల్లి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ..

 

 

 

ఏపీ సీఎం ఓ మూర్ఖుడు అని, ఆయనకు పరిపాలన చేతకాదంటూ నేరుగా నిప్పులు చెరిగారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మూర్ఖపు పాలనపై రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. జగన్ కు ఎందుకు ఓటు వేశామా? అని ఏపీ ప్రజలు చాలా రోజులుగా బాధపడుతున్నారన్నారు. ఏపీలో తనకు ఎందరో తెలుసని, వారిని పలకరించినప్పుడల్లా జగన్ ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు.  ఏపీ రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని ఆమె ధీమాగా చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే జగన్ పాలన అంతం అవుతుందని, తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని రేణుక అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కూడా రేణుకా చౌదరి వచ్చి రైతులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

 

Tags: Renuka’s focus on AP politics

Leave A Reply

Your email address will not be published.