స్వేచ్ఛ పేరుతో తెలుగు తమ్ముళ్లకు  బాధ్యతలు

Responsibilities for Telugu horns under the name of freedom

Responsibilities for Telugu horns under the name of freedom

Date:19/09/2018
విజయవాడ ముచ్చట్లు:
చంద్రబాబు నాయుడు ఒక సంగతి తేల్చేశారు. తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో తాను కృష్ణుడి పాత్రకే పరిమితమని చెప్పేశారు. పార్టీకి సారథ్యం వహిస్తాను తప్పితే ప్రచార రంగంలోకి అడుగుపెట్టనన్నారు. ‘మీరే చూసుకోండి. ప్రాతిపదికను సిద్దం చేసి ఇస్తాను. పార్టీకి ప్రాముఖ్యం లభిస్తే పదవులు మీకే. ఓటమి పాలైతే పరువు పోయేదీ మీకే. పొత్తులు, స్థానాల సర్దుబాటు వంటి విషయాల్లో మీరే ఒక నిర్ణయానికి రావాలి.’ అంటూ చంద్రబాబు నాయుడు టీటీడీపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది.
తెలంగాణ విషయంలో అనవసర ప్రాధాన్యత నిస్తే ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతింటామనే అంశం ఆయనను ఈ నిర్ణయానికి ఉసి గొల్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బతికిబట్టకట్టాలంటే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలి. అదే సమయంలో తాను అత్యుత్సాహం చూపినట్లు బహిరంగమైతే పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపాక్టు ఎక్కువగా ఉంటుందని అంచనాకొచ్చారు. ఫలితంగా ఆయుధంబు ధరింప అంటూ ప్రతిన బూనారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు అన్యాపదేశంగా గతంలోనే సూచించారు.
ఇందుకు ప్రధాన కారణం నిన్నామొన్నటివరకూ కేసీఆర్ అటు బీజేపీ, ఇటు కాంగ్రెసుతో సమ దూరం పాటించారు. ఆ సందర్బంలోనే టీఆర్ఎస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావించింది. అయితే అది వర్కవుట్ కాలేదు. బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నంతకాలం కేసీఆర్ సైతం తెలుగుదేశం పార్టీ ద్వారా కేంద్రంతో సఖ్యత, సంబంధాలు నెలకొల్పుకోవాలని యోచించారు. అవసరమైతే బీజేపీకి అయిదు స్థానాలు, టీడీపీకి పది స్థానాలు కేటాయించేందుకు సైతం ఒక దశలో సిద్ధమైనట్లు ప్రచారం సాగింది. దీనివల్ల టీఆర్ఎస్ ఎన్డీఏలో భాగస్వామిగా మారిపోతుంది. అయితే బీజేపీ,టీడీపీ విడిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.
టీడీపీని దూరం పెట్టేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కేంద్రంతో కయ్యం కొని తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశమూ ఇందులో దాగి ఉంది. దానికితోడు టీడీపీ దూరమైంది కాబట్టి ఆ స్థానాన్ని టీఆర్ఎస్ భర్తీ చేయవచ్చనే దూరాలోచన కూడా ఉంది. అయితే నేరుగా ఇప్పటికిప్పుడు బీజేపీతో అంటకాగితే ముస్లిం ఓట్లు దూరమవుతాయి కాబట్టి ముందస్తు ఎన్నికలు పెట్టి అసెంబ్లీలో బలపడాలనుకున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుని లోక్ సభ ఎన్నికల నాటికి కమలం పార్టీతో చెట్టపట్టాలు కట్టవచ్చని అంచనా వేశారు. అందుకు బీజేపీ సైతం తనవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. టీడీపీ సీన్ లోంచి దూరమైంది. పైపెచ్చు నరేంద్రమోడీ, అమిత్ షాలు చంద్రబాబునాయుడిపై ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రా సీఎం బీజేపీని బలిపెట్టే ఎత్తుగడలకు పాల్పడటం వారికి నచ్చలేదు.
అందువల్ల తమ పరోక్ష మిత్రుడైన కేసీఆర్ ను కూడా అటువైపు తొంగిచూడకుండా చేసేశారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే కాంగ్రెసుతో చేతులు కలపాలని తాజాగా చంద్రబాబు సూచించారు. కేంద్రం కేసీఆర్ కు తనకు మధ్య విభేదాలు పెంచాలని చూస్తోందని ఆరోపించడంలోని ఆంతర్యమిదే.టీఆర్ఎస్ లో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు , కీలకమైన నాయకులు టీడీపీ మూలాలు ఉన్నవాళ్లే.
స్వయంగా కేసీఆర్ కే పదిహేను సంవత్సరాలకు పైగా టీడీపీతో అనుబంధం ఉంది. చంద్రబాబునాయుడితో విభేదించిన ఫలితంగానే టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాత టీడీపీ మిత్రులను సగౌరవంగా ఆహ్వానించి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. టీడీపీకి, టీఆర్ఎస్ కు మధ్య పొత్తు కుదిర్చేందుకు వీరంతా గతంలో ప్రయత్నించారు. ఒకానొక దశలో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మారిన రాజకీయపరిస్థితుల్లో అనివార్యంగా ఈ రెండు పార్టీలు దూరం కావాల్సి వచ్చింది.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివిధ సర్వేల ఫలితం తెలుసు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేంత ప్రబలమైన శక్తిగా ప్రతిపక్షాలు లేవు. టీడీపీ కాంగ్రెసుతో చేయి కలిపితే పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుంది. అదృష్టం బాగుంటే కీలకమైన పాత్ర పోషించగలుగుతుంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు వీలుంటుందనే యోచనలో ఉన్నారు చంద్రబాబునాయుడు. మహాకూటమి రూపంలో టీఆర్ఎస్ కు బలమైన పోటీనిచ్చి బొటాబొటి మెజార్టీ వద్ద నిలువరించగలిగితే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది.
టీడీపీ, టీఆర్ఎస్ తో సంకీర్ణ భాగస్వామి కావచ్చనేది దూరాలోచన. అంతేకాకుండా కేంద్రంలోనూ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే కేసీఆర్ తో జట్టు కట్టడం ద్వారా తిరిగి ఎన్డీఏలో చేరవచ్చనేది బాబు యోచనగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మొత్తమ్మీద స్వేచ్ఛ పేరిట తెలుగు తమ్ముళ్లను రణరంగంలోకి దింపి తాను మాత్రం దూరంగా ఉంటూ భవిష్యత్ తెలుగుదేశం వ్యూహానికి టీడీపీ అదినేత పక్కా స్కెచ్ గీస్తున్నారంటున్నారు.
Tags:Responsibilities for Telugu horns under the name of freedom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *