అక్రమార్జనకు తెర తీస్తున్న రెవెన్యూ అధికారులు

Date:13/03/2018
వైజాగ్ ముచ్చట్లు:
విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు అవినీతి చెదలు అంటుకున్నాయి. కొద్ది సంవత్సరాలుగా జిల్లాలోని రెవ్యెన్యూ అధికారులు, సిబ్బంది అక్రమార్జనకు ద్వారాలు తెరిచారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంలో వీరు ఆరితేరిపోయారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అధికారికంగా కట్టబెట్టిన ఘనులు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. కబ్జాకోరులకు వెన్నుదన్నుగా నిలిచి ప్రబుద్థులు ఈ జిల్లాలో ఉండడం వలన వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైపోయింది. రాష్ట్రంలో మరెక్కడా లేనంత అవినీతి విశాఖ రెవెన్యూ శాఖలో పేరుకుపోవడం గమనార్హం. విశాఖ జిల్లాలో 3000 కోట్ల రూపాయల భూ కుంభకోణం రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందంటే, రెవెన్యూ అధికారుల అవినీతి తీవ్రత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో పనిచేసిన కొంతమంది కలెక్టర్లు ప్రభుత్వపరంగా పలువురికి కేటాయించిన భూములు, ప్రభుత్వ భూములను అన్యులకు కట్టబెట్టడానికి నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్లు జారీ చేశారు. సిట్ దర్యాప్తులో దాదాపూ ఐదు, ఆరుగురు కలెక్టర్లు జారీ చేసిన ఎన్‌ఓసీలను పరిశీలించి, అందులోని లోపాలను నివేదికలో పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్‌ఓసీల జారీ పెద్ద ఎత్తున జరిగిపోయింది. అప్పటి జిల్లా మంత్రి బాలరాజు కలెక్టర్లు జారీ చేస్తున్న ఎన్‌ఓసీలపై తీవ్ర అభ్యరంతరం కూడా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా భీమిలి తహశీల్దార్ శంకరరావు, విశాఖ రూరల్ తహశీల్దార్ బీ.టీ.రామారావు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వీరిద్దరి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి, వందల కోట్ల రూపాయల అక్రమార్జనను బయటపెట్టారు. వెబ్ రికార్డులను తారుమారు చేయడానికి వీరు సహకరించారు. విశాఖలో చాలా కాలం కిందట పనిచేసిన ఓ చైన్‌మేన్ గణేశ్వరరావును విజయనగరం బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తునే, విశాఖలో ఉంటూ తహశీల్దార్ రామారావును అనేక విధాలుగా లోబరుచుకుని రికార్డుల టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఈ తహశీల్దార్ల బండారం బయటపడిన తరువాత గణేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడిచేస్తే, వారే ఆశ్ఛర్యపోయేంగా అక్రమార్జన బయటపడింది. గణేశ్వరావు రెవెన్యూ శాఖను పూర్తిగా వాడేసుకున్నాడు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని నగరంలోని అనేక ఇళ్లను అక్రమంగా సొంతం చేసుకున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోపోవడం ఆశ్ఛర్యకరం. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట ఇద్దరు వీఆర్‌ఓల ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడిచేస్తే 100 నుంచి 150 కోట్ల అక్రమార్జన బయటపడింది. వీరు కూడా రికార్డుల తారుమారులో సిద్ధహస్తులు. రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుని ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తెచ్చారు.
Tags: Revenue Officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *