Natyam ad

సచివాలయాల్లో రెవెన్యూ సేవలు

నెల్లూరు ముచ్చట్లు:


రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 15వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు మండల తహశీల్దార్‌, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన అన్ని రకాల సేవలూ అందుబాటులోకి వచ్చాయని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరైనా, ఎక్కడి నుండి అయినా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌, అడంగల్‌ కాపీలు సచివాలయం నుంచి వెంటనే జారీ చేస్తున్నారు. రికార్డుల్లో మార్పులు, భూమి స్వభావం వివరాలకు సంబంధించిన ఏటువంటి మార్పులకు అయినా సచివాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం 21 రోజులు గడువు విధించింది. దరఖాస్తు (ఫారం 8)ను సమర్పించిన 24 గంటల్లో సచివాలయం నుంచి ఆన్‌లైన్లో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ)కి చేరుతుంది. విఆర్‌ఒ విచారణకు 15 రోజుల గడువు విధించారు. అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే తహశీల్దార్‌కు నివేదించాలి. అభ్యంతరాలు లేకుంటే 16వ రోజు కల్లా విఆర్‌ఒ తన నివేదికను తహశీల్దార్‌కు సమర్పించాలి. సంబంధిత తహశీల్దార్‌ దరఖాస్తును పరిష్కరించినా, తిరస్కరించినా రెవెన్యూ డివిజన్‌ అధికారి (ఆర్‌డిఒ)కి నివేదించాలి.

 

 

తిరస్కరణకు గురైన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆర్‌డిఒకు వెళతాయి. ఆర్‌డిఒ పరిశీలించి ఆమోదం తెలపవచ్చు. లేదా తహశీల్దార్‌ అభిప్రాయాన్ని ఆమోదించవచ్చు. 15 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయలేని సమీప భూయజమానులు ఆ తర్వాత ఆర్‌డిఒకు అప్పీలు చేసుకోవచ్చు. ఆర్‌డిఒ, తహశీల్దార్లకు కూడా రెండేసి రోజులు సమయం ఇచ్చారు. చివరిగా 21 రోజుల్లో సంబంధిత దరఖాస్తుదారుడికి పత్రాలు అందించాలి. భూ లావాదేవీల్లో మార్పులకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారానికి నెల రోజులు గడువు విధించారు. గుంటూరు జిల్లాలో గత 45 రోజుల్లో 692 మంది రికార్డుల్లో మార్పులకు, 711 మంది హక్కుల బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తున్నామని, రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని 33 మంది విఆర్‌ఒలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. భూ సంబంధిత అంశాలపై సచివాలయాలకు వస్తున్న దరఖాస్తుల పరిష్కార పురోగతిని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది.

 

Post Midle

Tags: Revenue Services in Secretariats

Post Midle