కరోనాతో పడిపోయిన ఆదాయాలు

హైదరాబాద్  ముచ్చట్లు:
గతేడాది లాక్‌డౌన్‌ వల్ల సంభవించిన ఆర్థిక నష్టాల నుంచి తేరుకోకముందే.. మరోసారి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించాల్సి రావటంతో ఖజానా తీవ్ర కుదుపులకు లోనైంది. పన్నులు, పన్నేతర రాబడితోపాటు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు కూడా విడుదల కాకపోవటంతో సర్కారు ఇక్కట్ల పాలైంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్‌, మే)లోనే గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఏప్రిల్‌లో రూ.6,800 కోట్ల ఆదాయం రాగా… మేలో రూ.1,600 కోట్లు తగ్గి రూ.5,200 కోట్లే సమకూరింది. ఈ రెండు నెలల్లో కలిపి రూ.4.100 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయామంటూ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కోసం సర్కారు… బాండ్లను వేలం వేయటం ద్వారా రూ.3వేల కోట్లను సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా రాష్ట్రం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు మరిన్ని మినహాయింపులు, సడలింపులూ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిసింది. కరోనా రెండో దశ వ్యాప్తి, దాని తీవ్రత కూడా తగ్గిందంటూ వైద్య, ఆరోగ్యశాఖ కూడా ప్రకటించిన దరిమిలా.. అందుకనుగుణంగా సీఎం కార్యాచరణ చేపట్టబోతున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఈనెల 19తో ముగియబోతున్న ప్రస్తుత లాక్‌డౌన్‌పై శుక్రవారం మంత్రులతో ఆయన మాట్లాడి.. తద్వారా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇస్తున్న లాక్‌డౌన్‌ సడలింపును… రాత్రి 9 గంటల దాకా పొడిగించే అవకాశముంది. ఆ తర్వాత బయటకెళ్లిన వారు గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా మరో గంట సమయమివ్వనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ లేదంటే కర్ఫ్యూ కొనసాగించే వీలుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ను విధించిన మే 12 నుంచి ఇప్పటిదాకా దానికి దశల వారీగా మినహాయింపులు, సడలింపులు ఇస్తూ వస్తున్నారు. దీంతో మొదట్లో కొంత స్తబ్దుగా ఉన్న ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మెల్లగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రాత్రి 9 గంటల వరకూ మినహాయింపులిస్తే అవి మరింత ఊపందుకుంటాయి. తద్వారా ప్రభుత్వ రాబడులు పెరుగుతాయి. ఈ కోణంలో ఆలోచించే లాక్‌డౌన్‌కు మరిన్ని మినహాయింపులు, సడలింపులు ఇచ్చేందుకు సర్కారు యోచిస్తున్నది. ఇదే సమయంలో కరోనా మూడో దశ అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో… కేసులు పెరిగితే, వాటిని నియంత్రించేందుకు సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Revenues dropped with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *