గుత్తాను టార్గెట్ చేసిన రేవంత్

Date:15/02/2018
నల్గొండ ముచ్చట్లు:
అవ‌కాశం దొరికినా, లేదా దొరకబుచ్చుకునైనా తెరాస నేత‌ల‌పై విరుచుకుప‌డేందుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.గాంధీభ‌వ‌న్ లో అడుగుపెడుతూనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వియ్యంకుడి నకిలీ కుల ధ్రువ పత్రాల బండారం బ‌య‌ట‌పెట్టారు. ఆ త‌రువాత‌, గ‌తంలో పార్ల‌మెంట్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వులు పొందిన తెరాస నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ ఎన్నిక సంఘాన్ని కోరారు. నిజానికి, ఈ రెండు అంశాల్లోనూ ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయార‌నే చెప్పాలి. కానీ, ఇప్పుడు మ‌రో అస్త్రంతో రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి రేవంత్ టార్గెట్ ఎవ‌ర‌నుకున్నారు… కాంగ్రెస్ ఎంపీ, తెరాస నేత గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి! ఆయ‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు, తెరాసలో చేరినా ప‌ద్ధ‌తిగా కండువా కూడా క‌ప్పుకోలేదు! కాబ‌ట్టి ఆయ‌న కాంగ్రెస్ ఎంపీ, తెరాస నేత అవుతారు క‌దా! గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తెరాస గూటికి చేరిందే ప‌ద‌వి కోసం..! కానీ, ఆ అవ‌కాశం కోసం ఆయ‌న ఎదురుచూడాల్సి వ‌స్తోంది. అందుకే, మిగ‌తా జంప్ జిలానీల కంటే ఆయన చాలా కంఫ‌ర్ట్ జోన్ లో ఉండి వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అయిన‌ప్పటికీ.. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు వెళ్ల‌డం మానేశారు. తెరాస కండువా క‌ప్పుకుంటే వెంట‌నే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాలన్న డిమాండ్ వస్తుంది కాబ‌ట్టి, రంగు మార్చ‌లేదు! కానీ, ఇప్పుడు ఎంపీ ప‌ద‌వికి సంబంధించి ఆయ‌న ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి త్వ‌ర‌లోనే రాబోతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అదెలా అంటే… జిల్లా రైతు స‌మ‌న్వ‌య క‌మిటీల నియామకం పూర్త‌వ‌గానే, క‌మిటీ అధ్య‌క్షుడి ప‌దవిలో ఆయ‌న కూర్చోవ‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీని కోస‌మే ఆయ‌న గ్రామ రైతు స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు! క‌మిటీ అధ్య‌క్షుడి ప‌ద‌వికి క్యాబినెట్ ర్యాంకు క‌ల్పిస్తామ‌ని గ‌తంలోనే ముఖ్య‌మంత్రి చెప్పారు క‌దా! ఇప్పుడు అదే జ‌రిగితే… వెంట‌నే రేవంత్ రంగంలోకి దిగేస్తారట. ఇప్ప‌టికే కావాల్సిన అస్త్రాలూ ప‌త్రాలూ అన్నీ సిద్ధం చేసుకున్నార‌ట‌! ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా, రైతు స‌మ‌న్వ‌య క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి చేప‌డితే… కోర్టుకు వెళ్లేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉంటూ, మ‌రో లాభ‌దాయ‌క‌మైన ప‌ద‌విలో కొన‌సాగ‌డం రాజ్యాంగ విరుద్ధం క‌దా. ఇదే పాయింట్ మీద ఆ మ‌ధ్య ఢిల్లీలో 20 మంది ఆప్ నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని రాష్ట్రప‌తికి ఎన్నిక‌ల సంఘం సూచించింది. గుత్తా విష‌యంలో కూడా ఈ పాయింట్ మీద హైకోర్టులో కేసు వేసేందుకు రేవంత్ రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ముందే ఎంపీ ప‌ద‌వికి గుత్తా రాజీనామా చేస్తే ఏ స‌మ‌స్యా ఉండ‌దు. కానీ, ఉప ఎన్నిక‌ను ఎదుర్కోవాల్సి రావొచ్చు. దీనికి తెరాస సిద్ధంగా లేద‌నేది చాన్నాళ్ల నుంచీ గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే, ఇక్క‌డ ఇంకో లాజిక్ ను తెరాస త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉంద‌ట‌! సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఎవ‌రైనా ప్ర‌జా ప్రతినిధి రాజీనామా చేస్తే… ఆ స్థానానికి వెంట‌నే ఉప ఎన్నిక నిర్వ‌హించ‌రాద‌ని ఎన్నికల సంఘం చెబుతోంది! దీన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని, గుత్తా కోరిన ప‌ద‌వి ఆయ‌న ఇస్తూనే, ఆయ‌న‌తో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించినా కూడా ఉప ఎన్నిక రాని ప‌రిస్థితి కోసం తెరాస వ్యూహ ర‌చ‌న చేస్తోంద‌ని కూడా అంటున్నారు. మ‌రి, గుత్తాపై రేవంత్ ఎక్కుపెట్టి ఉంచిన బాణం ఎలా దూసుకెళ్తుందో చూడాలి.
Tags: Reverent Target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *