శ్రీవారి బ్రహ్మోత్సవాలపై భద్రతాపరమైన అంశాలపై అధికారులతో సమీక్ష.

తిరుపతి  ముచ్చట్లు:

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అసాధారణమైన భద్రత.బ్రహ్మోత్సవాలకు భద్రతాపరమైన అన్ని చర్యలను తీసుకోవాలి.టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద కూడా భద్రతను ప్రతిష్టం చేయాలి.గరుడ సేవ రద్దీని గుర్తించి ముందస్తుగా అనువైన పార్కింగ్ ప్రాంతాలను తిరుమల తిరుపతి నందు గుర్తించి లైటింగ్ సదుపాయంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.దొంగతనాల అరికట్టేందుకు ముందస్తుగా అంతరాష్ట్ర దొంగలను గుర్తించి వారి ఫోటోలను కనబడే విధంగా ఏర్పాటు చేయాలి.శ్రీవారి మాడవీధుల గ్యాలరీలు మరియు క్యూలైన్ల వద్ద ఎగ్జిట్ ఎంట్రీలను పటిష్ట పరిచి అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలి.పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.గరుడ సేవకు అదనపు బలగాలు.రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రత మరింత కట్టు దిట్టం.తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ గారు పోలీసు అధికారులతో భద్రత సంబంధిత విషయాలపై తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సమీక్ష సమావేశానికి జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారుల అందరూ హాజరై బ్రహ్మోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరిగాయని, ఈ ఏడాది కోవిడ్ ఆంక్షలు లేనందువలన భక్తులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.ముఖ్యంగా స్వామివారి సేవలలో ప్రధానమైన గరుడ సేవ రోజు, రథోత్సవం చక్రస్నానం వంటి ప్రధాన ఉత్సవాల సమయంలో భక్తులు తాకిడి తిరుమలకు ఎక్కువగా ఉంటుందన్నారు.బ్రహ్మోత్సవాల సమయంలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.అదేవిధంగా తిరుమలలోని అవసరమైన అన్ని ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో రాత్రి సమయంలో వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేయాలని దాని ద్వారా నేరపూరిత కార్యక్రమాలు నివారించడానికి వీలవుతుందని తెలిపారు.

 

 

బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లాకు చేరుకునే వాహనాలను తనిఖీ చేయడానికి ముఖద్వారాల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను పటిష్టం చేయాలని అవసరమైతే ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి మరియు రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్లే ప్రధాన దారుల్లో వీఐపీలు రాకపోకలు జరిగే అవకాశం ఉన్నందువలన ఆ మార్గంలో పోలీసు భద్రతను పటిష్టం చేయాలని సూచించారు.గరుడ సేవ రోజు మరియు ఇతర ప్రధాన రోజులలో పార్కింగ్ సమస్య తిరుమల లో ఎక్కువగా ఉంటుందని దానిని నివారించడానికి ముందుగానే పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి వాహనాలను ఆ ప్రాంతాల వైపు మళ్ళించి పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలగకుండా వాహన రద్దీని పూర్తిగా తగ్గించాలని కోరారు.బ్రహ్మోత్సవాల సమయంలోనే పాఠశాలలకు సెలవులు కూడా ఉండడంతో భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉంటుందని అందుకు తగిన విధంగా పోలీసులు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని కోరారు.

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల సందర్భంగా అనవాయితీలో భాగంగా పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని ఆ రోజున ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుంచి ఘాట్ రోడ్ నందు తిరుమలకు చేరుకునే ప్రధాన మార్గములన్నిటిలోనూ భద్రతను పటిష్ట పరచాలని కోరారు.గరుడసేవ ఇతర ముఖ్య రోజుల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో అదనపు బలగాలను కూడా పోలీసు విభాగం ఉపయోగించుకుని ఉందని తెలిపారు.తరచుగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి మరియు అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన ఫోటోలను సైతం అవసరమైన ప్రాంతాల్లో సైన్ బోర్డు లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులు అప్రమత్తంగా ఉంటారని అన్నారు.ఈ సమీక్ష నందు అడిషనల్ ఎస్పీ ఇ.సుప్రజ, తిరుమల క్రైమ్ అడిషనల్ ఎస్పీ విమల కుమారి , లా&అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ   కులశేఖర్ , తిరుమల అడిషనల్ యస్.పి ముని రామయ్య , యస్.బి I చంద్రశేఖర్, జిల్లా లోని డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్.ఐ లు యస్.ఐ లు పాల్గొన్నారు.

 

Tags: Review with officials on security issues on Srivari Brahmotsavam.

Leave A Reply

Your email address will not be published.