కొండెక్కిన కోడి ధరలు

నల్గొండ ముచ్చట్లు:


కోడి ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ 300 రూపాయలకు పెరగడంతో ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. దీంతో సామాన్యు డు చికెన్‌ తినే పరిస్థితి కనిపించడంలేదు. 40 రోజులుగా చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కిలో ధర రూ.170 నుంచి రూ.190 ఉండగా ప్రస్తుతం రూ.300 చేరింది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా చికెన్‌ విక్రయాలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌, శుభకార్యాలు ఉండడంతో చికెన్‌కు డిమాండ్‌ ఉంది. వాస్తవానికి ఎండాకాలంలో చికెన్‌ ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్‌ ధరలు పెరిగాయి. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఒక్కో కోడి సుమారు కిలోన్నర బరువు రావడానికి 35నుంచి 40రోజుల సమయం పడుతుంది. మార్చి నుంచి ఎండలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కోడి ఎదుగుదల తగ్గుతుంది. బరువు రావడానికి 20రోజులు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఉత్పత్తి తగ్గుతుండడంతో డిమాండ్‌ అంతకంత పెరుగుతోంది. ఎండ వేడికి తట్టుకోలేక కోళ్లఫాంలలో కోళ్లు చనిపోతున్నాయి.నెల రోజుల క్రితం ఆదివారం నాలుగు వేల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగితే, చికెన్‌ ధర పెరగడంతో ప్రస్తుతం రెండు వేల కిలోలు మాత్రమే విక్రయాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా గతంలో ఆదివారం రోజున 18 వేల కిలోల నుంచి 22 వేల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతుండేవి. ప్రస్తుతం చికెన్‌ ధర పెరగడంతో 14 వేల కిలోల చికెన్‌ మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. కిలో చికెన్‌ కొనాలనుకునే వారు, ప్రస్తుతం అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. పట్టణాల్లో కేజీ చికెన్‌ రూ.300 విక్రయిస్తుండగా.. గ్రామాల్లో రూ.330 వరకు విక్రయిస్తున్నారు. పట్టణంలో ఒక కోడి గుడ్డు ధర రూ.5.50 పైసల నుంచి రూ.6వరకు అమ్ముతున్నారు. గ్రామాల్లో రూ.7వరకు అమ్ముతున్నారు. చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని వాపోతున్నారు.వేసవికాలం ప్రారంభం కావడంతో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల చికెన్‌ ధరలు పెరిగిపోతున్నాయనీ చికెన్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. 300 రూపాయల రేటు ఆల్టైమ్ రికార్డుగా వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో కోళ్ళ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

 

Tags: Rising chicken prices

Leave A Reply

Your email address will not be published.