పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చులు

నిజామాబాద్  ముచ్చట్లు:

వరి సాగుఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. మార్కెట్‌లో ముడిసరకుల ధరలు పెరుగుతుండటంతో పంట పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో ట్రాక్టర్లకు, కూలీలకు అన్నింటికి డిమాండ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్, విత్తనాల ధరలు పెరగడంతో పాటు పెట్టుబడులు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి వరి పంటకు 15శాతం వరకు పెట్టుబడులు పెరిగాయి. వ్యవసాయాధికారులు రైతులకు ఆధునిక పద్ధతులను సూచించకపోవడం వల్ల ప్రతి ఏటా నష్టపోతున్నారు.ఏటికేడు వ్యవసాయం భారంగా మారుతోంది. పెరిగిన ధరలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మార్కెట్‌లో ముడిసరుకులన్నింటికి ధరలు పెరగడంతో ఇందుకు అనుగుణంగా పంట పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే వరి పంట చేతికి వచ్చే సమయానికి 15 శాతం వరకు ఖర్చు పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంచనా వేస్తున్నారు. నాట్లు సమయంలోనే ఊహించని ఖర్చులను ఎదుర్కొంటున్న రైతులు.. పంటలు పూర్తయ్యే వరకు ఎంత ఖర్చు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏటేటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ మద్దుతు ధర ఏమాత్రం పెరగడంలేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లలో చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వాటి ఆయకట్టు కింద ఈ ఏడాది వరి సాగు గణనీయంగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. గతంలో సాగులో లేని భూములను కూడా ఈ ఏడాది సాగు చేపట్టడంతో సాగు విస్తరణ అంచనాలకు మించి పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతో గ్రామాల్లో ట్రాక్టర్లకు, వ్యవసాయ కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో వరి పొలం దున్నెందుకు ట్రాక్టర్ యజమానులు ధరలను పెంచారు.గతేడాది మే నెలలో లీటర్‌ డీజిల్‌ రూ.67.88 ఉండేది. ప్రస్తుతం రూ.97.20కు పెరిగింది. దీన్నిబట్టి గత ఏడాదితో పోల్చితే లీటర్‌ డీజిల్‌పై రూ.29.32 పెరిగింది. దీంతో వరి పొలం దున్నేందుకు ట్రాక్టర్ యాజమానులు ఎకరాకు రూ.3500 నుంచి రూ.4వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇతర వ్యవసాయ యంత్రాలు కిరాయిలు కూడా డీజిల్ ధరలకు అనుకూలంగా పెరిగిపోయాయి. సాగు విస్తీర్ణ పెరగడంతో సరిపడా కూలీలు లేక తీవ్రమైన కూలీల కొరత ఏర్పడింది. దీంతో గ్రామాల్లోని కూలీలు రోజుకు రూ.500 వరకు కూలీలను డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు 30 కిలోల వరి విత్తన బ్యాగ్ కు రకాలను బట్టి రూ.105 నుంచి రూ.142 పెంచారు. గతేడాది ఆర్జీఎల్ విత్తన బ్యాగును సబ్సిడీ పోనూ రూ.706.50కు విక్రయించగా ఈ ఏడాది రూ.834కు విక్రయించారు. వీటన్నిటిని కలిపి క్వింటాళ్ వరి పండించేందుకు రైతుకు రూ.2,700 నుంచి రూ.3000 ఖర్చు వస్తుండగా ప్రభుత్వం మాత్రం క్వింటాళ్ వరికి మద్దతు ధరను రూ.1,888 మాత్రమే చెల్లిస్తోంది.పంట పెట్టుబడులను తగ్గించే ఆధునిక పద్ధతులను రైతులకు సూచించడంతో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. వరిలో వెదజల్లే పద్ధతిని రైతులకు తెలియజేయడంతో వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతు వేదికల ద్వారా అవగాహన తరగతులను నిర్వహించాల్సిన వారు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు పాత పద్ధతులను వినియోగిస్తూ వ్యవసాయంలో నష్టాలను చవిచూస్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Rising farm costs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *