పెరుగుతున్న గోదావరి మట్టం

భద్రాచలం ముచ్చట్లు:

గోదావరి  పరివాహకంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జులై నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోకముందే మరోసారి ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా మూడో ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే పునారావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా.. పెరుగుతున్న ఉద్ధృతితో ముంపు మండలాలు వారం రోజులుగా నీటిలో చిక్కుకున్నాయి. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుపై వరద నీరు చేరింది. దీంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని కోరుతున్నారు. అయితే గోదావరికి వరదలు వచ్చి నెల రోజులైనా కాకముందే మరోసారి ప్రవాహం పెరగడంతో భద్రాచలం వాసులు ఆందోళన చెందుతున్నారు.జులై నెలలో వచ్చిన వరద తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఒకానొక దశలో భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి 70 అడుగులు దాటి ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. భద్రాచలం పట్టణం నీట మునిగింది. రామాలయం చెంతకు గోదావరి నీరు చేరింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వంతెనపై రెండు రోజుల పాటు రాకపోకలు నిలిపివేశారు. ఆ రోజులను మరిచిపోకముందే మరోసారి వరద వస్తుండటంతో భద్రాచలం వాసులు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటున్నారు.

 

Tags: Rising Godavari level

Leave A Reply

Your email address will not be published.