కొండెక్కతున్న మటన్, చేపలు, రొయ్యల ధరలు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో నాన్ వెజ్ ధరలు రోజురోజుకు మరింత ప్రియంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేజీ చికెన్ ధర రూ.320కు చేరగా, లైవ్ కోడి కేజీ రూ.156 వరకు ధర పలుకుతోంది. దీంతో ఇప్పటివరకు తక్కువకు లభించిన చికెన్‌కు కూడా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ఇప్పటివరకు పౌల్ట్రీ వ్యాపారులు తక్కువ పరిమాణంలో కోళ్లను పెంచడంతో కొరత ఏర్పడింది. కొరత ఏర్పడడంతోనే ఒక్కసారిగా ధర పెరిగిందని ఖమ్మంకు చెందిన ఓ చికెన్ షాప్ వ్యాపారి అన్నారు. ఇదిలా ఉండగా దాదాపు ఈ ఏడాది చివరి వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 10వేల బ్రాయిలర్ పామ్స్ ఉండగా, 2వేల లేయర్ పామ్స్ ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ని రైతులు కొన్ని పామ్స్ ను ఏర్పాటుచేసుకుని కోళ్లను పెంచుతున్నారు.వేసవి కాలం కావడంతో సమయానికి దిగుబడి రావాల్సిన పిల్లలు రాకపోవడంతో ప్రస్తుతం చికెన్ కు అమాంతం ధర పెరిగింది. దీంతో పాటు పౌల్ట్రీ రైతులకు, కంపెనీలకు మధ్య సాగుతున్న ధరల వివాదం నేపథ్యంలోనూ రైతులు కోళ్లను పెంచడంలేదు. ఈ కారణం వలన కూడా కోళ్ల కొరత ఏర్పడింది. ఒకవైపు వేసవి, మరో వైపు రైతుల ధరల నేపథ్యంలో చికెన్ కు ధర పెరిగింది.ప్రస్తుతం చికెన్ ధర పెరుగుతుండగా మరో వైపు మటన్, చేపలు, రొయ్యలు కూడా తగ్గేదె లేదన్నట్టు ధరలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం కేజీ మటన్ ధర రూ.850 నుంచి 950 వరకు పలుకుతుండగా, కొర్రమీను చేప కేజీ రూ.350 నుంచి 450 వరకు, రొయ్యలు కేజీ సైజు ను బట్టి రూ.350 కు పైగా పలుకుతున్నాయి. అయితే ఒక్కసారిగా పెరుగుతున్న నాన్ వెజ్ ధరలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Tags: Rising mutton, fish and prawn prices

