Natyam ad

రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదం

పాపన్నపేట ముచ్చట్లు:

 

రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాలను దిక్కులేని వారిని చేసింది. మృతులంతా కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అకోలా-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ప్రభాకర్‌, భీమయ్య, శ్రీకాంత్‌లు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్థులు పాల్గొని నివాళులర్పించారు.

Post Midle

మిన్నంటిన రోదనలు

పాపన్నపేట మండలం బాచారానికి చెందిన గడ్డం భాగయ్య, సాయమ్మల రెండో కుమారుడు ప్రభాకర్‌ సీతానగర్‌కు చెందిన భవానీని పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో తీరని విషాదం నెలకొంది.

గడ్డం పెంటయ్య, పోచమ్మల మూడో కుమారుడు భీమయ్య మిల్లులో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అల్లాదుర్గం సాయిలు, సుజాతల కుమారుడు శ్రీకాంత్‌ ఇంటర్‌ వరకు చదివి కూలీ పనులు చేస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి.

నిశ్చితార్థానికి వెళ్లి

బాచారానికి చెందిన ఓ వ్యక్తి నిశ్చితార్థానికి గ్రామస్థులు అందోల్‌ మండలం నాద్లాపూర్‌కు వెళ్లారు. శ్రీకాంత్‌ గ్రామస్థులతో కలిసి ట్రాక్టర్‌లో వెళ్లాడు. ప్రభాకర్‌ ద్విచక్ర వాహనంపై భీమయ్య, మాసయ్య వెళ్లారు. విందు అనంతరం గ్రామస్థులు ట్రాక్టర్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. శ్రీకాంత్‌ ట్రాక్టర్‌ ఎక్కలేకపోయాడు. దీంతో ప్రభాకర్‌ వాహనంపై వస్తానని కోరడంతో నలుగురు కలిసి బయలుదేరారు. గడిపెద్దాపూర్‌ శివారులో రోడ్డు అవతలి వైపు వెళ్లేందుకు అపసవ్య దిశలో ప్రయాణించారు. ఎదురుగా వచ్చిన కారు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మాసయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలను మైనంపల్లి హన్మంతరావు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సైతం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున సాయం అందజేశారు.

 

Tags:Road accident is a tragedy in three families

Post Midle