Natyam ad

ఘోర రోడ్డు ప్రమాదం… ఎనిమిది మంది దుర్మరణం.!

ఆపరేషన్ షిఫ్ట్’తో తగ్గిన మృతుల సంఖ్య

భాకరాపేట ఘాట్లో లోయలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

శనివారం రాత్రి దుర్ఘటన

అనంతపురం జిల్లా నుంచి తిరుచానూరుకు నిశ్చితార్థానికి వస్తుండగా ప్రమాదం.

తిరుపతి – చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు వద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రాత్రి ఒంటి గంట వరకు అందిన సమాచారం మేరకు.. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 54 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపు వద్ద అదుపు తప్పి కుడివైపున 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల రోదనలు, మృత దేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల్లో 8 మంది పిల్లలు సహా వృద్ధులున్నారు..