గ్రేటర్ వరంగల్‌కు చుట్టూ ఔఆర్ఆర్
వరంగల్ ముచ్చట్లు:
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టుల మాటున కొంతమంది ఓరుగల్లు ఎమ్మెల్యేలు లాభపడుదామని పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో రెవెన్యూ, గ్రేటర్ వరంగల్, కుడా అధికారులు సైతం ఉన్నట్లు సమాచారం. కుడా చేపట్టబోయే ల్యాండ్ పూలింగ్, ఏయే ప్రాంతాల్లో కుడా వెంచర్లు ఏర్పాటు చేయబోతోంది, ఏఏ గ్రామాల్లో రైతుల భూములు కొనుగోలు చేపట్టబోతోందన్న విషయం ముందే సమాచారం కలిగి ఉన్న ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు, గ్రేటర్, కుడా అధికారులు పెద్ద మొత్తంలో ఆయా ప్రాంతంలో భూముల కొనుగోలు చేపట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హసన్ పర్తి, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో రింగు రోడ్డు సమీపంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని కొందరు నేతలు బినామీలతో ముందు జాగ్రత్తగా భూములు కొనుగోలు చేశారనే చర్చ జరుగుతోంది. ఒక్కో ఎమ్మెల్యే పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశాడని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు భూములు కొనుగోలు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ, అసైన్డ్ భూములను, రైతులకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా ప్రభుత్వం చేస్తున్న రియల్ వ్యాపారం, ఆ తర్వాత సమీప భూముల ధరలు పెరిగేలా చేస్తున్న ప్రయత్నాలే రైతుల ఆగ్రహానికి కారణంగా మారాయని కొంత మంది పేర్కొంటున్నారు.వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకున్న గ్రామాల్లో కుడా పెద్ద వెంచర్లు చేయాలని భావించింది. ఇందుకోసం ప్రభుత్వమే స్వయంగా రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూసేకరణ చేసి కుడా ఆధ్వర్యంలో వెంచర్లు చేసి విక్రయించాలని యోచించింది. గ్రేటర్ వరంగల్‌కు చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతాలతో పాటు ప్రతిపాదిత ప్రాంతాల్లో సైతం కుడా ల్యాండ్ పూలింగ్ను చేపట్టాల ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే అధికారులు సర్వే కూడా ప్రారంభించడంతో ఆయా సర్వే నంబర్లలో భూములున్న రైతులు ఆందోళన బాటపట్టారు.
రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఆరంభించడం తీవ్ర వివాదాస్పదమైంది. రైతులకు ఇష్టమైతేనే అంటూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించినా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులందరనీ రైతులు ఘెరావ్ చేశారు. ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. రైతుల ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గారు. రాజకీయంగాను నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే ఆగమేఘాల మీద కుడాలో సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు ప్రకటించగా, తాత్కాలికమేనంటూ మెలిక పెడుతూ కుడా కమిషనర్ ప్రావీణ్య ప్రకటన జారీ చేశారు.ల్యాండ్ పూలింగ్ను నిలిపేస్తూ కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ తీసుకున్న నిర్ణయం వెనుక ఎమ్మెల్యే ఒత్తిడి ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ల్యాండ్ పూలింగ్తో సొంత భూముల రేట్లు పెంచుకోవాలని భావించిన కొందరు ప్రజా ప్రతినిధులకు రైతుల ఆందోళనలు షాక్ ఇచ్చాయంటున్నారు. రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు వెనుకడుగు వేయడంతో ల్యాండ్ పోలింగ్ జీవో నిలిచిపోయిందన్నా ప్రచారం జరుగుతోంది. ఇంత చేసిన అధికార పార్టీ నేతలు పైనా రైతులకు కోపం తగ్గకపోవడం గమనార్హం.

Tags: RRR around Greater Warangal
