రూ. 55.14కోట్ల వ్య‌యంతో 34.60కి.మీ రోడ్ల అభివృద్ది

Date:16/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
వ‌రంగ‌ల్లు, యాదాద్రి జిల్లాల‌కు వెళ్లే వాహ‌నాలు ప్ర‌యాణికుల‌కు ఉప్ప‌ల్ రింగ్‌రోడ్ నుండి, బోడుప్ప‌ల్ వ‌ర‌కు ఇరుకు రోడ్లు, భారీ స్థాయిలో వాహ‌నాల వ‌ల్ల నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడ‌డం నిత్య‌కృత్య‌మైంది. ఇలాంటి ప‌రిస్థితుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగేలా జీహెచ్ఎంసీ ప్ర‌త్యామ్నాయ రోడ్ల అభివృద్దిని చేప‌ట్టింది. దాదాపు 55కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో కుషాయిగూడ నుండి ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు, ఎన్‌.ఎఫ్‌.సి క్రాస్ రోడ్ నుండి చెర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు, చెంగిచెర్ల నుండి ఆర్టీసి జోన‌ల్ డిపో వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తులు, నూత‌న రోడ్ల‌ను వేయాల‌ని ప్ర‌ణాళిక రూపొందించింది. ఈ రోడ్డు విస్త‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌లు ఉగాది ప‌ర్వ‌దిన‌మైన 18వ తేదీన ప్రారంభోత్స‌వ చేయ‌నున్నారు. కుషాయిగూడ నుండి ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు మూడు కిలోమీట‌ర్ల ర‌హదారి విస్త‌ర‌ణ‌, ఎన్‌.ఎఫ్‌.సి క్రాస్‌రోడ్ నుండి చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు 5.10కిలోమీట‌ర్లు, చెంగిచర్ల నుండి ఆర్టీసి జోన‌ల్ డిపో వ‌ర‌కు 8.60కిలోమీట‌ర్ల మేర రోడ్డు విస్త‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తులు, నూత‌న రోడ్ల నిర్మాణాల‌ను రూ. 27.08కోట్ల‌తో చేప‌డుతున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. అదేవిధంగా తార్నాక నుండి మౌలాలి మీదుగా ఇ.సి.ఎల్ వ‌ర‌కు 9.30కిలోమీట‌ర్ల ర‌హ‌దారి అభివృద్దిని రూ. 11.17కోట్ల‌తో చేప‌డుతున్నామ‌ని, అదేవిధంగా ఐ.డి.ఏ నాచారం రోడ్డు, ఉప్ప‌ల్ స్టేడియం రోడ్డును రూ. 16.89కోట్ల వ్య‌యంతో పూర్తిస్థాయిలో అభివృద్ది చేప‌డుతున్నామ‌ని తెలిపారు. మొత్తం 34.60కిలోమీట‌ర్ల ర‌హ‌దారుల అభివృద్దిని రూ. 55.14కోట్ల వ్య‌యంతో హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ద్వారా చేప‌డుతున్న‌ట్టు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌క‌టించారు. ఈ రోడ్డు అభివృద్ది ప‌నుల‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఉగాది రోజు ప‌నుల‌ను ప్రారంభిస్తార‌ని, ఈ రోడ్ల నిర్మాణం పూర్తితో వ‌రంగ‌ల్లు మార్గంలో వెళ్లే ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.
Tags: Rs. 34.60 km road development with cost of 55.14 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *