రొయ్యకు రూల్స్ లేవ్. 

Date:22/07/2019

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

జిల్లాలో విచ్చలవిడిగా రొయ్యల చెరువుల సాగు పేరుతో జరుగుతున్న ఆక్రమణలు, నిబంధనల అతిక్రమణలు వ్యవస్థనే దిశానిర్దేశం చేసే స్థాయిని దాటుతున్నాయి. రొయ్యల మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితిని మానుకుని చోద్యం చూసే పరిస్థితికి అధికార యంత్రాంగం వచ్చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లో సాగుతున్న ప్రకృతి ధ్వంసంపై ప్రశ్నించే గొంతుకే కరవవుతుందన్న విశ్లేషకుల ఆవేదన సముద్ర ఘోషలో కలిసి పోతోంది. జిల్లాలో కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల మండలాల్లో రొయ్యల చెరువుల సాగు జరుగుతోంది. ప్రతి ఏటా రొయ్యల చెరువుల సాగు పెరుగుతూ వస్తోంది. విచ్చలవిడిగా పెరుగుతున్న రొయ్యల సాగుతో ఆదాయం సమకూరే మాట అటుంచితే ప్రకృతికి, పర్యవసానంగా వ్యవసాయానికి తీరని నష్టం వాటిల్లుతోంది.

 

 

అనుమతుల్లేకుండా పంటపొలాల్లో రొయ్యల చెరువులు నిర్మించడం అతిక్రమణ అయితే, ప్రభుత్వ భూముల్లో ప్రకృతిని ధ్వంసం చేసి రొయ్యల చెరువులు  నిర్మించి సాగు చేయడం ఆక్రమణ. ఇలా రెండు వైపులా సాగుతున్న దందాతో అంతర్లీనంగా వ్యవసాయ రంగానికి పరోక్ష నష్టం జరుగుతోంది.జిల్లాలోని సముద్ర తీరానికి అనుకుని ఉన్న తంపర భూములు, చిత్తడి నేలలు ఆక్రమణలు చేసి వేలాది ఎకరాల్లో రొయ్యల చెరువుల నిర్మాణాలు జరిగాయి. దీంతో సముద్ర క్రీక్‌లు మూసుకుపోతున్నాయి. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు క్రీక్‌లు, జగన్నాథపురం క్రీక్‌లు దాదాపుగా మూసుకుపోయాయి. ఏడు మండలాల నుంచి వివిధ గెడ్డల ద్వారా సముద్రంలో కలవాల్సిన వరదనీరంతా స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కోల్పోయింది. రొయ్యల చెరువుల అడ్డుతో పంట పొలాలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. వారాలకొలదీ ముంపులోనే ఉండిపోతున్నాయి.

 

 

 

 

మరో వైపు చిత్తడి నేలలన్నీ రొయ్యల చెరువులుగా మారిపోతుండడంతో ఆయా ప్రాంతాల్లో జీవనం సాగించే వివిధ రకాల జాతులు కనుమరుగయిపోతున్నాయి. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది.వ్యవసాయ భూముల్లో రొయ్యల, చేపల చెరువులు తవ్వాలంటే ఆ భూములకు సంబంధించిన రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ భూములను రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారులు బృందంగా పరిశీలించాలి. అవి సాగుకు పనికిరావని, నిస్సారవంతమైనవిగా ధ్రువీకరించాలి.

 

 

 

 

రొయ్యల చెరువులుగా తవ్వుకోవడానికి చుట్టుపక్కల రైతుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని మండల కమిటీ జిల్లాస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలి. జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి వాటికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు లేవని ధ్రువీకరించిన తరువాతే చెరువుల తవ్వకాలకు అనుమతులు జారీ చేస్తారు. అయితే జిల్లా స్థాయి కమిటీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే భారీగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇప్పటికే సంతబొమ్మాళి మండలంలో నౌపడ, మర్రిపాడు, ఆకాశ లఖవరం, మూలపేట, జగన్నాథపురం, సున్నాపల్లి, తదితర ప్రాంతాల్లో వ్యవసాయ సాగు భూములన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిల్లో చాలా వరకు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది.

 

 

 

రొయ్యల చెరువుల దందాలో వారు వీరంటూ ఎవరికీ మినహాయింపు లేనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అవకాశమున్నచోట ఎవరికి దొరికింది వారి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్షమన్న బేధం లేదు. ఉద్యోగి, అధికారి అన్న వ్యత్యాసం లేదు. అందరికీ అందులో భాగస్వామ్య ముందన్న ఆరోపణలకు సమాధానమే యేటికాయేడు పెరుగుతున్న రొయ్యల చెరువుల విస్తరణ.

 

 

 

 

ప్రభుత్వ భూమిని కళ్లెదుటే ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చేస్తుంటే అధికారులు ఆక్రమణదారుడు నష్టపోకుండా మానవతా దృక్పథంతో కొంతకాలం చేసుకోవడానికి సమయమిచ్చామంటూ చెబుతున్న వివరణలు లోగుట్టును తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా మారిన పరిస్థితుల్లో ఎకరాకు రూ.30 వేలు నుంచి రూ.లక్ష వరకు ఏడాదికి వసూళ్ల రూపంలో వెళ్లిపోతుందన్న బహిరంగ రహస్యాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి.

గ్రేటర్లో ఉన్న 457 పురాతన శిథిల భవనాలపై చర్యలు – దానకిషోర్

Tags: Rules Leave to Shrimp.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *