నాలుగు నెలల్లో పరుగులే..

Run in four months

Run in four months

 Date:19/07/2018
విజయవాడ ముచ్చట్లు:
బందరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ పనులు సకాలంలో పూర్తి కానున్నాయి. గత కొన్ని నెలలుగా  రేయింబవళ్లు నిర్మాణ పనులు సాగిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. న్యాయ కేసులు, చిక్కులు ఎదురుకావడంతో కొంతకాలం జాప్యమయ్యింది. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేశారు. కానూరు నుంచి పెనమలూరు వరకు ఉన్న న్యాయస్థానం కేసులు ఇటీవల ఉపసంహరించడంతో పనులు వేగవంతం చేసి పూర్తి చేశారు.  మొత్తం 64 కిలోమీటర్ల నాలుగు వరసల  విస్తరణ రహదారి 90శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 10శాతం పనులు ఉన్నాయి. బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్ పనులు కూడా నవంబరు నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. బందరు-విజయవాడ రోడ్డు విస్తరణకు రెండేళ్ల కిందట కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాల్సిన ఈ రోడ్డు ఏడాది వరకు నత్తనడకన సాగింది.
విజయవాడ, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పమిడిముక్కల, పామర్రు, గూడూరు, బందరు మండలాలను కలుపుతూ జాతీయ రహదారి వెళ్తుంది. మొత్తం 64 కిలోమీటర్ల రోడ్డు నాలుగు వరసలుగా విస్తరించి నిర్మాణం చేయాల్సి ఉంది. గతంలో ఉన్న రెండు వరసల రోడ్డును ఆధునికీకరిస్తున్నారు. దీనికి కిలో మీటరుకు వ్యయం రూ.14.36 కోట్లు ఖర్చు అంచనా వేశారు. బెంజి సర్కిల్‌ పైవంతెనతో సహా మొత్తం 4 మేజర్‌ వంతెనలు, 5 మధ్యతరహా వంతెనలు, 5 అండర్‌పాస్‌లు నిర్మాణం చేయాల్సి ఉంది. వీటిలో బెంజి సర్కిల్‌ మినహా అన్ని పూర్తయ్యాయి. 22 కిలోమీటర్లు సర్వీసు రోడ్డు వస్తుంది. 107 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాలి. బస్‌బేలు 34 ప్రాంతాల్లో ఉంటాయి. కంకిపాడు దాటిన తర్వాత టోల్‌గేటు ఏర్పాటు చేయనున్నారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తాన్‌బాద్‌ గ్రామాల్లో 15.85 కిలోమీటర్ల వరకు బైపాస్‌ నిర్మాణం చేశారు. బైపాస్‌ మొత్తం సీసీ రోడ్డుగా నిర్మాణం చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.740 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు భారీగా వ్యయం అవుతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న నాలుగు వరసలను యధాతథంగా ఉంచుతారు. పోరంకి వరకు 8.4 కిలోమీటర్లు 45 మీటర్ల (150అడుగులు) వెడల్పు, ఆ తర్వాత 60 మీటర్ల (200అడుగులు) వెడుల్పుతో రోడ్డునిర్మాణం చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది.పలు ప్రాంతాల్లో కాలువల కోసం తూములు ఏర్పాటు చేయడం వివాదంగా మారుతోంది. పంట కాలువలు రోడ్డును దాటాల్సి ఉంది. సాంకేతికంగా అక్కడ కల్వర్టులు (వంతెనలు) ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రీట్‌ దిమ్మలతో ఈ వంతెనలు ఉంటాయి. కానీ తూములు ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహాన్ని బట్టి తూములు సామర్థ్యం సరిపోతుందని చెబుతున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాలు వెళ్తుంటాయి. 10 టన్నుల నుంచి 50 టన్నులు వరకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తూములు ధ్వంసం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారికి మధ్యన డివైడర్‌ ఏర్పాటు చేశారు. దీనిలో మొక్కలు పెంచాల్సి ఉంది. మెక్కలు పెంచేందుకు ఎర్రమన్ను పోయాల్సి ఉంది. కానీ రాళ్లు పోశారు. దీని వల్ల మొక్కలు పెరిగే అవకాశం లేదని అంటున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో సూచికల ఫలకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి సర్వీసు రహదారి లేకపోవడం గమనార్హం. దీనికి కారణం సర్వే సమయంలో డీపీఆర్‌ అలాగే తయారు చేశారని అంచనాలు ఆవిధంగానే రూపొందించారని పీడీ చెబుతున్నారు. కంకిపాడు ప్రాంతంలో టోల్‌ ఏర్పాటు చేస్తున్నారు. నవంబరు తర్వాత టోల్‌ రుసుము వసూలు చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో (ఎన్‌హెచ్‌ఏఐ) దీన్ని నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్‌ ఏర్పాటు చేయవచ్చు. అయితే 64 కిలోమీటర్లకు కలిపి ఒకటే ఏర్పాటు చేయనున్నారు. రుసుములు మాత్రం 64 కిలోమీటర్లకు నిర్ణయిస్తారు. ఈ రహదారిని  కాంట్రాక్ట్ సంస్థ బీఓటీ కాకుండా ఈపీసీ పద్ధతిలోనే నిర్వహించినందున టోల్‌ వసూలు ఎన్‌హెచ్‌ఏఐ తీసుకుంది.
నాలుగు నెలల్లో పరుగులే.. https://www.telugumuchatlu.com/run-in-four-months/
Tags:Run in four months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *