ఖరీఫ్ పై కోటి ఆశలతో రైతన్న

Date:13/06/2019

నల్లగొండ ముచ్చట్లు:

 

వానాకాలంపై ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బోర్లు, బావుల కింద పంటల సాగు చేసే రైతులు వరినాట్లు వేస్తుండగా, రుతుపవనాల రాకకుముందే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో పత్తి రైతులు దుక్కులు సిద్ధంచేస్తూ పత్తి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకుతాయన్న సమాచారం, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయన్న ఆశలతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ఉపక్రమించారు. నల్లగొండ జిల్లాలో 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. బ్యాంకర్లు పంట రుణాల పంపిణీకి కసరత్తు ఆరంభించారు. జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో వేరుశనగ పంటలు వేస్తారన్న అంచనాతో వ్యవవసాయ శాఖ విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. జిల్లా పత్తి రైతుల కోసం 11.5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 72,500 క్వింటాళ్ల వరి విత్తనాలు, 3 వేల క్వింటాళ్ల వేరుశనగ, మరో 1500 క్వింటాళ్ల ఇతర మెట్ట, ఆరుతడి పంటల విత్తనాలు రైతాంగానికి అందించేందుకు మండలాల వారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిల్లాలోని 4.50 లక్షల మంది రైతులకు పంట రుణాలు అందించేందుకు వార్షిక పంట రుణ ప్రణాళికలను ఖరారు చేసి బ్యాంకర్లకు రుణ లక్ష్యాలను నిర్దేశించారు.

 

 

 

 

 

 

అటు కేంద్ర నుండి పీఎం కిసాన్ సమ్మాన్ పథకం సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఎకరాకు పంటకు 5 వేల సహాయాన్ని రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుండటంతో రైతాంగం ఎన్నో ఆశలతో ఖరీఫ్ పంటల సాగు పనుల్లో నిమగ్నమైంది.జిల్లా పంటల సాగు విస్తీర్ణం అనుసరించి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయన్న అంచనాలతో దఫాలవారీగా ఇండెంట్‌తో ఎరువులను తెప్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 77 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 31 వేల డీఏపీ, 57వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 25 వేల ఎంవోపి, 12,500 ఎస్‌వోపీ ఎరువులు అవరసమని అంచనా వేశారు. ఇందులో ప్రస్తుతం వివిధ రకాల ఎరువులు 10 వేల వరకు సరాఫరాకు అందుబాటులో ఉన్నాయని, డిమాండ్‌ను అనుసరించి ఇండెంట్ మేరకు జిల్లాకు ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు.

 

 

 

 

 

సూర్యాపేట జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షా 92,350 హెక్టార్లలో పంటల సాగు జరుగుతుందని అంచనా వేయగా వరి 93 వేల ఎకరాల్లో, పత్తి 49వేల హెకార్ల వరకు సాగవుతుందని అంచనా వేశారు. ఎరువులు లక్షా 33 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయగా, వివిధ పంటలకు కలిపి విత్తనాలు 19,500 క్వింటాళ్లు అవసరమని అంచనావేసి రాష్ట్ర విత్తన సంస్థకు ప్రతిపాదనలు అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షా 30 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగవుతుందన్న అంచనా వేయగా పత్తి 65 వేల హెక్టార్ల మేరకు ఉంటుందని భావిస్తున్నారు. ఆయా పంటల సాగు అంచనాల మేరకు ఎరువులు, విత్తనాల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్‌లు సమర్పించి రైతులకు సరఫరా చేసేందుకు కసరత్తు సాగిస్తోంది.

కలకలం రేపుతున్న కోడెల ట్యాక్స్ వివాదం

 

Tags: Running on kharif hopes on kharif

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *