గ్రామీణ బ్యాంకులు.. ప్రైవేటీకరణ

Date:14/03/2018
ముంబై ముచ్చట్లు:
బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా 3-4 నెలల్లో ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా స్టాక్‌ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్‌ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్‌ సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్‌జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి. ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఏపీజీబీకి సిండికేట్‌ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్‌ బ్యాంక్‌లు స్పాన్సర్‌ బ్యాంక్‌లుగా వ్యవహరిస్తున్నాయి. గ్రామీణ బ్యాంక్‌ల్లో కేంద్రం 50 శాతం, స్పాన్సర్‌ బ్యాంక్‌లు 35 శాతం, ఆయా రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి.
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి కూడా బ్యాంకింగ్‌ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. 49 శాతం వరకు వాటాను ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు. పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్‌ బ్యాంక్‌ల వాటా 51 శాతానికి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15 శాతం వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. కానీ, ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు.ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45 శాతం వరకుంటుందని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం రెండూ సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు.
Tags: Rural banks .. privatization

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *