సచిన్ పైలెట్… యూ టర్న్ వెనుక

Date:13/08/2020

జైపూర్ ముచ్చట్లు:

సత్తా ఉంది… చరిష్మా ఉంది.. రాజకీయ వారసత్వం ఉంది.. ప్రజల్లో క్రేజ్ ఉంది.. వయసు ఉంది. కానీ వయసుడిగిన నేతలా సచిన్ పైలట్ వ్యవహరించారన్నది వాస్తవం. నిజానికి రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సచిన్ పైలట్ కారణం. తండ్రి రాజేష్ పైలట్ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సచిన్ పైలట్ పీసీసీ అధ్యక్షుడిగా అహర్నిశలూ కృషి చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాని కాంగ్రెస్ అధిష్టానం ఆయనను కాదని సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది.నిజంగా సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే అప్పుడే వ్యతిరేకించాల్సి ఉండేది. కానీ ఏడాదిన్నర కాలం నుంచి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు, సచిన్ పైలట్ కు పడటం లేదు. చివరకు ఆయన తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చారు. కానీ బయటకు వచ్చిన సచిన్ పైలట్ బీజేపీలో చేరలేదు. కొత్త పార్టీ పెడతానని ప్రకటించలేదు. దాదాపు నెలరోజుల పాటు దీనిపై నాన్చారు. రిసార్టుల్లోనే రాజకీయాలను నడిపించారు.చివరకు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సచిన్ పైలట్ చివరి అవకాశాన్ని కోల్పోయినట్లయింది. భవిష్యత్తులో సచిన్ పైలట్ వెంట ఎవరూ నడవరన్నది వాస్తవం.

 

ఎందుకంటే రాజీ పడే నేతలు రాజకీయాల్లో రాణించలేరు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను విభేదించి బీజేపీలో చేరిపోయి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను విభేదించి జగన్ సొంత పార్టీ పెట్టి అధికారంలోకి రాగలిగారు. కానీ సచిన్ పైలట్ మాత్రం ఇటువంటి ధైర్యం చేయలేకపోయారు.సచిన్ పైలట్ తన వెంట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారని అతిగా ఊహించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆరేళ్లపాటు ఉన్న సచిన్ పైలట్ కేవలం 18 మందిని మాత్రమే ఆకట్టుకోగలిగారు. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎక్కడా తగ్గలేదు. పార్టీ నుంచి సస్పెన్షన్ తో పాటు వారిపై అనర్హత వేటు వేయడానికి కూడా సిద్ధమయింది. దీంతో సచిన్ పైలట్ వర్గంలో ఉన్న వారి నుంచి కూడా అసహనం వ్యక్తం కావడంతోనే ఆయన రాజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. మరోవైపు తాను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా వసుంధర రాజే వర్గం ప్రభుత్వాన్ని కాపాడే అవకాశముందని ఆయన భావించారు. దీంతోనే ఆయన తగ్గారంటున్నారు. మొత్తం మీద సచిన్ పైలట్ సత్తా లేని నేతగా ముద్ర పడిపోయారు.

 

 

 రామనామమే…శిరోధార్యం

Tags:Sachin Pilot … behind your turn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *