సాగర్ ఫలాలు (గుంటూరు)

Sagar fruits (Guntur)

Sagar fruits (Guntur)

Date:09/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
నాగార్జునసాగర్‌ కాలువల ఆధునికీకరణ ఫలాలు ఆయకట్టు రైతులకు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ప్రారంభమైన ఆధునికీకరణ పనులు 2018 జులైలో ముగిశాయి. కాలువలకు సిమెంట్‌ లైనింగు చేయడంతోపాటు కాలువ అత్యంత లోతులో ప్రవహించే ప్రాంతం(డీప్‌కట్‌)లో షార్ట్‌ క్రీటింగ్‌ చేయడంతో నీటి నష్టాలు తగ్గాయి. లీకేజీలు అరికట్టడం కూడా దోహదపడింది. సాగర్‌ జలాశయం నుంచి 91వ కిలోమీటరు వరకు ప్రధాన కాలువలో 1250 క్యూసెక్కుల నీరు పొదుపు చేసినట్లు జలవనరులశాఖ వర్గాల అంచనా. గతంతో పోలిస్తే ఆధునికీకరణ తర్వాత అన్ని కాలువల ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందిస్తున్నారు. ప్రధాన కాలువ పరిధిలో వృథాకు అడ్డుకట్ట పడినా మైనర్లలో షట్టర్లు లేక వృథా కొనసాగుతోంది.
సాగర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేసి 33 కిలోమీటర్ల దూరంలోని బుగ్గవాగులో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి కాలువలకు విడుదల చేస్తున్నారు. బుగ్గవాగుకుపై ఆరు మేజర్లు ఉండగా వీటికి 250 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆధునికీకరణకు ముందు జలాశయం నుంచి బుగ్గ వాగుకు చేరేలోపు 1000 క్యూసెక్కులు తగ్గేది. ఇందులో 250 మేజర్లకు విడుదల చేయగా 750 నీటి నష్టాలు ఉండేవి. ప్రస్తుతం ఆరు మేజర్లకు 250 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా మరో 200 మాత్రమే నీటి నష్టాలు ఉంటున్నాయని గుర్తించారు. ఈ లెక్కన 33 కిలోమీటర్ల  పరిధిలో గతంతో పోల్చితే వృథా తగ్గి 550 క్యూసెక్కులు పొదుపు చేసినట్లయింది. 33 కిలోమీటర్ల పరిధిలో టన్నెల్‌తోపాటు డీప్‌కట్ ఉండడంతో నీటి నష్టాలు ఎక్కువగా ఉండేవి. ఆధునికీకరణతో వీటికి అడ్డుకట్ట పడినట్లు జలవనరుల శాఖ లెక్కలు తేల్చింది.
బుగ్గవాగు 33వ కిలోమీటరు నుంచి 91వ కిలోమీటరు చేజర్ల వరకు 58 కిలోమీటర్ల మేర సాగర్‌ కుడి కాలువ ప్రయాణిస్తోంది. ఈ మధ్యలో వృథా ఎక్కువగా ఉండేది. నాలుగేళ్ల కింద సెప్టెంబరులో, ప్రస్తుతం నీటి విడుదల లెక్కలు పరిశీలిస్తే 700 క్యూసెక్కుల నష్టాలు తగ్గినట్లు తేలింది. 2014 సెప్టెంబరులో బుగ్గవాగు వద్ద 11 వేల క్యూసెక్కులు వదిలితే చేజర్లకు వచ్చే సరికి అన్ని కాలువలకు విడుదల చేసిన నీరు, చేజర్లకు చేరింది లెక్కిస్తే 9350 ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన 1650 క్యూసెక్కుల నష్టాలు ఉన్నాయి.
ఇందులో కాలువ వెంబడి మోటార్లు వేసి ఆయకట్టులో లేని పొలాలకు అనధికారికంగా 200 నుంచి 300 క్యూసెక్కులు తోడినట్లు గుర్తించారు. ప్రస్తుతం బుగ్గవాగు నుంచి 10450 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా 9700లకు లెక్క తేలింది. దీంతో 750 క్యూసెక్కులు మాత్రమే నష్టాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి మోటార్ల ద్వారా తోడే నీరు సుమారు 200 క్యూసెక్కులు కలిపితే 950 నష్టాలుగా లెక్కించారు. గతంలో 1650 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం 950కే నీటి నష్టాలు పరిమితమయ్యాయి. దీంతో 700 క్యూసెక్కులు ఆదా అవుతున్నాయి.
కృష్ణానదికి నీటి లభ్యత ఏటికేడు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి చుక్క కీలకంగా మారింది. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత సమర్థంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కాలువల లీకేజీలు అరికట్టడంతో నీటి నిర్వహణలో మార్పులు తీసుకురావడంవల్ల ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందుతోంది. సాగర్‌ జలాశయం నుంచి తీసుకున్న ప్రతి చుక్క సద్వినియోగమయ్యేలా చర్యలు చేపట్టింది.
2014లో 11 వేల క్యూసెక్కులు బుగ్గవాగు నుంచి విడుదల చేస్తే చేజర్ల రెగ్యులేటర్‌ నుంచి కాలువకు 3800 క్యూసెక్కులు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం 10400 క్యూసెక్కులు బుగ్గవాగు నుంచి తీసుకుని అన్ని కాలువలకు సామర్థ్యం మేరకు విడుదల చేసినా చేజర్ల వద్ద 4100 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ఆధునికీకరణవల్ల నీటి ఆదా సాధ్యమైనందనడానికి ఇదే నిదర్శనం. ఒక టీఎంసీ పొదుపు చేస్తే అదనంగా మాగాణి భూములకు అయితే 8 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకు 14 వేల ఎకరాలకు నీరందించవచ్చు.
Tags:Sagar fruits (Guntur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *