ప్రశ్నార్థకంగా మారిన సాగర్‌ ఆయకట్టు?

Date:12/01/2019
ఖమ్మం ముచ్చట్లు:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుష్కలంగా పంటలు పండి అన్నపూర్ణగా వెలుగొందిన సాగర్‌ ఆయకట్టు రబీలో ప్రశ్నార్థకంగా మారింది. రబీకి ముందే ప్రభుత్వం సాగర్‌ నీటి విడుదలపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు యథావిధంగా నాట్లేశారు. రబీ సీజన్‌ చివరి వరకు నీరు విడుదల చేయలేమని ఇటీవల ఎన్‌ఎస్‌పీ అధికారులు చెప్పడంతో సాగర్‌ కింద పంటలు సాగు చేసిన రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వివిధ దశల్లోని పైర్లు ఇప్పటికే వాడిపోయాయి. పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కండ్ల ముందే ఎండిపోతున్న పైర్లను బతికించుకునే మార్గం లేక కన్నీటిపర్యంతమవుతున్నారు. కనీసం మరో రెండు నెలల వరకైనా నీరు విడుదల చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం చింతకాని, మధిర, బోనకల్‌, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు తదితర మండలాల్లో పైర్లు నీరు లేక వాడిపోతున్నాయి.
మార్చి నెలాఖరులోగా మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నీరిచ్చేందుకు సాగునీటిని అర్ధాంతరంగా ఆపేశారు. ఖమ్మం జిల్లాలో సాగర్‌ రెండో జోన్‌ పరిధిలో మొత్తం 1.11లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, ప్రస్తుతం 90వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పెసర పంటలు సాగు చేశారు.
తొమ్మిది మండలాల్లోనూ పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఉన్నఫలంగా ఎన్‌ఎస్‌పీ అధికారులు సాగునీరు విడుదల చేయలేమంటూ ప్రకటించడంతో పైర్లు ఎండుముఖం పడుతున్నాయి.సాగర్‌ నీరు నిలిపివేతతో జిల్లాలోని మైనర్‌ సాగునీటి ప్రాజెక్టులతో పాటు, సాగర్‌ నీటి ఆధారిత మైనర్‌ ప్రాజెక్టుల పరిధిలో అనుబంధంగా ఉన్న దాదాపు 300చెరువుల కింద పంటల పరిస్థితీ దయనీయంగా మారింది. ముఖ్యంగా పాలేరు, వైరా రిజర్వార్లలో ఉన్న నీటిని ప్రభుత్వం మిషన్‌ భగీరథకు కేటాయించడంతో అసలు సమస్యకు కారణమైంది. సాగర్‌ ప్రధాన కాలువ ఖమ్మం జిల్లాలో 46కి.మీ. పొడవునా నీటి సరఫరా అందిస్తోంది. జిల్లాలో మొదటి, రెండో జోన్‌ను కలుపుకుని మొత్తం 17 మండలాల్లోని ఆయకట్టుకు సాగర్‌ జలాలు సరఫరా అవుతాయి. ప్రస్తుతం నీరు రాదనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  నీరు విడుదల చేస్తారని వరి సాగు చేశాను. ఇప్పుడేమో సాగర్‌ నీళ్లు ఆపేశారు. పైరు వాడిపోతోంది. ఎవరికి చెప్పుకున్నా నీరు రాదంటున్నారు. నీరు రాకపోతే మాకు తిండికి కూడా కష్టమేనని రైతులు వాపోతున్నారు.
Tags:Sagar has been questioned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *