నెల దాటుతున్న ఇంకా అందని జీతాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

ఉద్యోగాలకు ఎంపికైనప్పడు ఆయా క్యాడర్ల వారికీ ఇష్టమైన విభాగాన్ని ఎంచుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు. ఆ ఆప్షన్‌ పెట్టే సమయంలో వారికి తెలియదు… అందరితో సమానంగా పని చేసినా తమకు అందరిలా సౌకర్యాలుండవనీ. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని ఒక విభాగంలో పని చేస్తున్న ఆ ఉద్యోగుల పరిస్థితి అలాంటిది. మిగిలిన విభాగాల్లో అదే క్యాడర్లలో పని చేసే వారికి సమయానికి జీతాలొచ్చినా వారికి రావు. హెల్త్‌ కార్డులుండవు. పదోన్నతులు ఆలస్యమవుతుంటాయి. అందరి ఆరోగ్యం కోసం అహర్నిశలు పాటుపడే వారు కుంటుపడితే ఇక ఆదుకునే వారి కోసం ఎదురు చూడాల్సిందే. ఏండ్లు గడుస్తున్నా…..పాలకులు హామీలపై హామీలిస్తున్నా వారి సమస్యలు మాత్రమే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని వైద్యవిధాన పరిషత్‌ విభాగం పరిధిలో పని చేసే దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారుతున్నది.ఆ విభాగానికి ఏండ్ల తరబడి ఇంఛార్జి కాలం గడిపారు. ఇటీవల కొత్త కమిషనర్‌ రావడంతో సమస్యలు తీరుతాయని అంతా భావించారు. ఉద్యోగుల సమస్యలు తీరే మాటేమో గానీ కమిషనర్‌ కూడా ఆ సమస్యలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. ప్రతి నెలా జీతం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్ప ఇవ్వలేని పరిస్థితి. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.

 

 

 

వీటిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది తదితరులు దాదాపు ఎనిమిది వేల మంది ప్రాథమిక వైద్యానికి మించిన రోగులకు సేవలందిస్తుంటారు. ప్రతి నెలా మిగిలిన వారితో పాటు కాకుండా నిధులు విడుదలై, ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్ల అనుమతితో జీతాలు పొందాల్సిన పరిస్థితి. దీంతో మిగిలిన వారితో పోలిస్తే వీరికి జీతం చెల్లించేందుకు మరింత కాలయాపన జరుగుతున్నదని చెబుతున్నారు. జూన్‌ నెలకు సంబంధించిన జీతం జులై ఒకటిన అందాల్సి ఉన్నది. మూడు వారాలు గడిచినప్పటికీ జీతం రాకపోగా, ఎప్పటికీ వస్తుందో అడిగితే సరైన సమాధానం చెప్పే వారే లేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, పీజీలకు సంబంధించిన వేతనం, ఉపకారవేతనాలకు సంబంధించి ఆలస్యం కావడంతో ఆందోళన చెలరేగిన విషయం విదితమే.

 

 

 

గతంలోనూ ఇదే రకమైన సమస్య ఉత్పన్నమైనది. పదే పదే సమస్య తలెత్తుతుండటంతో సీరియస్‌గా తీసుకున్న సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఆలస్యానికి కారణాలను తెలుసుకుని వాటిని సరి చేసి సమయానికి జీతాలు వచ్చేలా చర్యలకు ఆదేశించారు. వైద్య విధాన పరిషత్‌ విషయంలోనూ మంత్రి జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రతి నెలా సమయానికి జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు నర్సుల పదోన్నతులు, ఉద్యోగులందరికి హెల్త్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం చేస్తామని ఇప్పటికే తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రకటించింది. ఉద్యోగుల్లో పెరిగిపోతున్న ఆందోళనను అర్థం చేసుకుని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

 

Tags: Salaries that have passed the month and are yet to be received

Leave A Reply

Your email address will not be published.