తెలంగాణలో ఇసుక ఆన్ ఆన్ లైన్ లోనే

Date:12/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అంతులేకుండా పోతోంది. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోతుండగా ఇండ్లు నిర్మించుకుంటున్న సామాన్యులపై అధికభారం పడుతోంది. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2 వేల నుంచి రూ. 2,500లకు ట్రాక్టర్ ట్రిప్పు లభించని పరిస్థితి కనిపిస్తోంది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. అయినా అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టింది లేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఒక ఇసుక టాక్స్ పాలసీని అధికారులు జిల్లాలో అమలు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహబూబ్‌నగర్, గద్వాల వంటి జిల్లాలో ఈ పాలసీ అమలవుతున్నట్లు తెలుస్తుండగా, స్థానిక అవసరాలకు సామాన్యులు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఇసుక కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. ఇసుక సరఫరాను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డీఆర్‌ఓ పర్యవేక్షణలో ఉండే ఈ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఇసుక సరఫరాపై పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా మేనేజ్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నారు. డీఆర్‌ఓ, ఆర్డీఓ, మైనింగ్ ఏడీ, సంబంధిత మండల తహసీల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. ఇసుక సరఫరా చేయాలనుకునే ట్రాక్టర్ల యజమానులు సొసైటీ నిర్ణయించిన మొత్తాన్ని డిపాజిట్ చేసి తమ ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సొసైటీలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ ట్రాక్టర్‌ను జీపీఎస్ సిష్టం పరిధిలోకి తెస్తున్నారు. దీంతో నిర్దేశించిన ప్రదేశానికి తప్ప మరో మార్గంలో వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న జమ్మికుంట మండలం తనుగుల, వీణవంక మండలం కోర్కల్, కరీంనగర్ మండలం చేగుర్తి, మానకొండూర్ మండలం లింగాపూర్, వెల్ది, వేగురుపల్లి, తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామాల పరిధిలోని వాగుల్లో మొత్తం ఏడు ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఇక నుంచి అధికారులు గుర్తించిన ఈ ఏడు రీచ్‌ల నుంచే స్థానిక అవసరాలకు ఇసుక సరఫరా చేస్తారు. జిల్లాలో 20 కిలో మీటర్ల పరిధిలోనే ఈ రీచ్‌లు ఉన్నాయి. అయితే మేనేజ్‌మెంట్ సొసైటీ ట్రాక్టర్ ట్రిప్పునకు ఎంత ధర నిర్ణయించాలో ఆలోచన చేస్తోంది. 8 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సరఫరా చేస్తే రూ.822కే ట్రాక్టర్ ట్రిప్పు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ యజమానులకు ప్రభుత్వం ద్వారానే చెల్లింపులు జరుపనున్నారు.జిల్లాలో ఇసుక వనరులు పుష్కలంగా ఉన్నాయి. మానేరు తదితర వాగుల నుంచి నిత్యం అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా ఆగడం లేదు. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా సామాన్యులు కొనలేని విధంగా ఇసుక ధరలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఇసుక టాక్స్ పాలసీ అమలైతే అక్రమ రవాణాకు బ్రేకులు పడతాయని అధికారులు భావిస్తున్నారు. స్థానిక అవసరాలకు ఇసుక సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న మేనేజ్‌మెంట్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయించుకునే ట్రాక్టర్ల యజమానులకు మాత్రమే సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
Tags: Sand on-line in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *