సంగంబండ రిజర్వాయర్‌…ఇళ్లు  జీవన్మరణ సమస్య

Date:26/10/2020

మెదక్ ముచ్చట్లు:

మక్తల్‌ మండలం భూత్పుర్‌ను 2010 నవంబర్‌ 3న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించింది. ఈ మేరకు జీఓ 122ను జారీ చేసింది. సంగంబండ రిజర్వాయర్‌ కట్టకు ఆనుకునే ఈ గ్రామం ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీటినిల్వ పెరిగి గ్రామంలో ఎక్కడ చూసినా ఊటలు కనిపిస్తున్నాయి. అప్పట్లో భూములకు తక్కువ ధర ఇచ్చినా, ఇళ్లకు మాత్రం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఉన్న భూములు కోల్పోయి, పునరావాసం గ్రామం ఏర్పాటుకాక, రిజర్వాయర్‌ సమీపంలో ఇళ్లు ఉండటం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఇళ్లలోకి ఊట వస్తోందని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భూత్పుర్‌ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామం కోసం ఆర్‌ఆర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు 2015లోనే స్థలం ఎంపిక చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తేమ అధికంగా ఉండటంతో చివరకు పంటలు సైతం పాడైపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇక మాగనూర్‌ మండలం నేరడుగాంలోని కొన్ని ఇళ్లలో సంగంబండ రిజర్వాయర్‌ ఆయకట్టు కింది నుంచి ఊట నీరు వస్తోంది. దీంతో 5, 6వ వార్డుల్లోని సుమారు 30 ఇళ్లలో ఈ నీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని పునరావాస కేంద్రంగా ప్రకటిస్తామని 2010లోనే అధికారులు సర్వే చేసి వదిలేశారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదని విమర్శిస్తున్నారు. వెంటనే పునారావసం కల్పించకపోతే ప్రమాదాలు జరిగి ఆస్తితో పాటు ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇటీవలి వర్షాలతో సంగంబండ రిజర్వాయర్‌ నిండింది. మా గ్రామం రిజర్వాయర్‌ కట్టకు దగ్గరలోనే ఉంది. దీంతో ఇళ్లలో ఊట వస్తోంది. నెల రోజులుగా వస్తున్న ఊట నీటిని బకెట్లు, కడవలతో ఎత్తిపోసినా ఫలితం లేదు. వారం రోజుల పాటు రెండు మోటార్లు పెట్టాం. ఐదేళ్ల కింద అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఇళ్లలో వచ్చే తేమను పరిశీలించి ఇళ్లకు నంబర్‌ వేసి వెళ్లారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వెంటనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మినిట్స్‌ కాపీలు

Tags: Sangambanda Reservoir … Home is a life and death problem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *