కృష్ణమ్మలో సంగమేశ్వరుడు

కర్నూలు ముచ్చట్లు:

అపురూప దృశ్యం.. ఆధ్యాత్మిక పరవశం.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సంగమేశ్వర  శివయ్యను తాకింది. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి. దీంతో ఆలయ పూజారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదికి చీర సారె సమర్పించి, మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా కృష్ణమ్మ  ఒడిలోకి చేరనుంది. మళ్లీ స్వామివారి దర్శనం కోసం 8 నెలల ఆగాల్సిందేనని ప్రధాన పూజారి తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటితో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో సంగమతీరం సంద్రాన్ని తలపిస్తోంది. సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది.ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ.. చివరికి సముద్రంలో కలసిపోతాయి. గతేడాది కూడా జులై నెలలోనే గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది. తొలి ఏకాదశి పూజల అనంతరం స్వామి వారికి ఈ సంవత్సరం చివరి పూజలు జరిపించారు అలయ అర్చకులు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మునిగివుంటుంది.వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగాన్ని భీముడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. సంగమ తీరంలో గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మునిగిన అపురూప దృశ్యం తిలకించేందుకు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

 

Tags: Sangameshwara in Krishnamma

Leave A Reply

Your email address will not be published.