దర్గాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం- నెల్లూరు నగర కమిషనర్ హరిత

నెల్లూరు ముచ్చట్లు:

రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బారా షహీద్ దర్గాలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ డి. హరిత అధికారులను ఆదేశించారు. బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలిసి కమిషనర్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాంగణంలో నిర్మించిన మరుగుదొడ్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని సూచించారు. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చే వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించి, పండుగ దినాలలో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వివిధ ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశాలను కమిషనర్ పరిశీలించారు. రొట్టెల పండుగ జరిగే స్వర్ణాల చెరువు తీరంతో పాటు, దర్గా పరిసర ప్రాంతాలు, రోడ్డు మార్గాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

 

 

 

పండుగ ప్రాంగణంలో వివిధ విభాగాలను సూచించే సూచికలను విస్తృతంగా ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. దర్గా ప్రాంగణంలో అవసరమున్న అన్ని విభాగాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువును అత్యంత పరిశుభ్రంగా ఉంచి, నీటిని నిరంతరం శుద్ధి చేస్తూ ఉండాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, శేషగిరిరావు, చంద్రయ్య, శానిటరీ సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Sanitation maintenance work in Dargah has been speeded up- Nellore City Commissioner Haritha

Leave A Reply

Your email address will not be published.