Natyam ad

సప్తవర్ణశోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

తిరుప‌తి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం వైభవంగా పుష్పయాగం జరిగింది.ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుండి 22వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు.అనంతరం మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3.5 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన
ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు ఈ పుష్పాలు విరాళంగా అందించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్
శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్
చెంగ‌ల్రాయులు, అర్చకులు బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్  కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Tags: Saptavarnasobhitham Sri Kalyana Venkateswara Swami’s flower offering

Post Midle
Post Midle