టమాట రైతులకు మద్దతుగా సర్కార్
కర్నులు ముచ్చట్లు:
దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వ కొత్త ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ది సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి నేతృత్వంలో ప్రక్రియ పూర్తైంది. దాదాపు 20 వేల మంది టొమాటో రైతులను కవర్ చేస్తూ 20 ఎఫ్.పి.ఓ. లతో ఇంటిగ్రేటెడ్ వేల్యూ చైన్ డెవలెప్మెంట్ జరుగనుంది.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
అందులో భాగంగానే టొమాటో రైతుల సంక్షేమానికై జగనన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని తెలిపారు. మార్కెట్, దళారుల ప్రమేయం లేకుండా టొమాటో రైతులకు కనీస మద్దతు ధర కల్పించి.. వారి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ టొమాటో వేల్యూ చైన్ డెవలెప్మెంట్ కు చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్స్ కింద టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు కాకాణి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జగనన్న ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏర్పాటు చేసిందన్నారు. సాధారణంగా డిమాండు, సప్లైకి అనుగుణంగా టొమాటో ధరలో హెచ్చుతగ్గులు ఉందడం వల్ల వినియోగదారులపై, రైతులకు భారంగా ఉంటుందని వివరించారు. టొమాటో ధరలు అధికంగా ఉన్నప్పుడు వినియోగదారులకు ఉపశమాన్ని కల్పించేందుకు, ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తుందని పేర్కొన్నారు.

Tags: Sarkar to support tomato farmers
