శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 18న జరుగనున్న పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం చేపట్టారు.మార్చి 18న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం .శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 18న నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Tags; Sastroktanga Ankurarpana for Sri Kalyana Venkateswara Swamy’s Puspa Yaga

