Natyam ad

సత్పురుషులు సాంగత్యం

విజయవాడ  ముచ్చట్లు:

మానవులు ఎల్లప్పుడూ సత్పురుషుల సాంగత్యంలో గడపాలి. ఎందుకనగా సత్పురుషులు ఎన్నడూ కూడా వారి మనసులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించరు, ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారు ప్రతియొక్కరిలోనూ మంచిని మాత్రమే చూస్తారు, చెడును ఎప్పుడూ చూడరు. ప్రతి వ్యక్తిలోనూ మంచి, చెడు రెండు లక్షణాలు ఉన్నాయి. అందరూ మంచివారు కాదు, అలాఅని అందరూ చెడ్డవారు కాదు. అందువలన ప్రతి వ్యక్తిలోనూ మంచి లక్షణాలను మాత్రమే మనం చూడాలి తప్ప చెడు లక్షణాలపైన ఎప్పుడూ శ్రద్ధ చూపకూడదు. ఇది సత్పురుషుల యొక్క లక్షణం.ఈ విషయంలో ఈశ్వరుడిని ఒక ఉదాహరణగా చెప్పారు. క్షీరసాగర మథనం నుండి చంద్రుడు మరియు హాలాహాలం ఉద్భవించాయి. ఈశ్వరుడు అందరికీ కనిపించే విధముగా చంద్రుడిని తన శిరస్సుపై ఉంచి, విషాన్ని మాత్రం తాను కంఠంలో దాచిపెట్టాడు. దీని వెనుక ఉన్న కారణం ఏమనగా, బయటకు మంచిని మాత్రమే ప్రదర్శిస్తూ, చెడును కనపడకుండా ఉంచాలి. పండితుడు మంచిచెడు రెండిటినీ సమగ్రంగా గ్రహించి, మంచిని స్వీకరించి, చెడుని నియంత్రిస్తాడు.

 

 

 

Post Midle

మనుష్యుడు ప్రతియొక్కరిలోనూ మంచిని మాత్రమే చూడాలి, చెడు లక్షణాలను కాదు. కానీ చెడు లక్షణాలను మాత్రమే చూడటం మనిషికి ఒక అలవాటుగా మారింది. ఒక వ్యక్తి ఎన్నో పనులు చేసినప్పటికీ అతనికి ప్రశంసలు రావు. అలాకాకుండా ఒక తప్పు చేస్తే మాత్రం ఆ తప్పుని మాత్రమే మనుష్యులు గుర్తిస్తారు. ఇది మనిషి యొక్క స్వభావం. కానీ సత్పురుషులు అలా కాదు వారు మంచిని మాత్రమే స్వీకరించి, చెడుని పారద్రోలుతారు. అందువలన మనము ఎప్పుడూకూడా సత్సాంగత్యంతో ఉంటే, మనము కూడా మంచి లక్షణాలను పొందుతాము, అలాకాకుండా చెడ్డవారితో స్నేహం చేస్తే మనము కూడా వారిలాగే దుర్లక్షణాలను పొందుతాము.సత్పురుషులు సంగత్యాన్ని వివరిస్తూ శ్రీ శంకర భగవత్పాదులవారు ఇలా అన్నారు –

 

 

सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं |
निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः ||
ఎల్లప్పుడూ కూడా సజ్జన సాంగత్యము వలన ప్రాపంచిక విషయములు దూరమయ్యి ఆత్మతత్వము తెలుసుకొనుటకు సహాయపడుతుంది. దాని వలన అనవసరమైన వ్యామోహముము నశించును. దీని ఫలితముగా మనలోని అజ్ఞానము తొలిగి అచంచలమైన మన మనస్సు నందు ఏకాగ్రత కలిగి, భగవంతునిపై నిలచును. తత్ఫలితముగ జీవునికి ముక్తి చేకూరును. కావున సత్సంగములకు వెళ్ళుట, సత్పురుషులను కలయుట చాలా ముఖ్యము. ఈ విధముగా మానవుడు ఎల్లప్పుడూ సత్పురుషులు సాంగత్యంలో గడపటం వలన వారి జీవితాలు ఎప్పుడూకూడా సుఖమయమవుతాయి.

|| हर नमः पार्वती पतये हरहर महादेव ||

— జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

 

Tags:Satpuruṣulu sāṅgatyaṁ

Post Midle