సౌకర్యాలేవ్..

Date:15/03/2018
ఒంగోలు ముచ్చట్లు:
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, సబ్‌సెంటర్లలో కనీస అవసరాలు తీరడంలేదు. కనీసం రక్తపోటు పరీక్ష యంత్రం కొనుగోలు చేయాలన్నా కొన్ని ఆస్పత్రుల్లో నిధులు లేవు. కొన్ని చోట్ల వైద్యాధికారులు, సీనియర్‌ సహాయకులు ముందుగా ఖర్చులు పెట్టి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 90 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 12 సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఏరియా ఆస్పత్రులకు పారిశుద్ధ్యం పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు మాత్రం జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా విడుదలవుతాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు ఆస్పత్రి అభివృద్ధి సంఘం (హెచ్‌డీఎస్‌), అన్‌టైడ్‌ నిధులే ఆధారం.ఈ ఏడాది నుంచి హెచ్‌డీఎస్‌, అన్‌టైడ్‌ నిధులను ఆన్‌లైన్‌లో నేరుగా ఆస్పత్రులకు జమ చేయాలని నిర్ణయించారు. గతంలో వైద్యఆరోగ్యశాఖకు ఒకే మొత్తంగా బడ్జెట్టు కేటాయిస్తే అక్కడి నుంచి ఆస్పత్రుల ఖాతాలకు పంపేవారు. ఈసారి గ్రామ పారిశుద్ధ్య నిధులు కూడా నేరుగా వైద్యాధికారి, ఏఎన్‌ఎంలతో కూడిన ఉమ్మడి ఖాతాకు పంపాలని నిర్ణయించారు. ఆ నిధులు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. జిల్లాలోని 1030 పంచాయితీలకు కలిపి సుమారు రూ.1.30 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు మురిగిపోయే అవకాశం లేకున్నా, కనీసం రెండు నెలల ముందుగానైనా వస్తే కొన్ని అవసరాలు తీరతాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. తీరా మార్చి ఆఖరున నిధులు ఇవ్వడం వల్ల డ్రా చేసే లోపు ట్రెజరీపై ఆంక్షలు వస్తున్నాయని చెబుతున్నారు.ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రతి సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలల్లో నిధులు విడుదల చేసేవారు. ఈసారి అయిదు నెలల ఆలస్యమైంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.75 లక్షలు, సీహెచ్‌సీలకు రూ.5 లక్షలు హెచ్‌డీఎస్‌ కింద నిధులు కేటాయిస్తారు. ఉప కేంద్రాలకు అన్‌టైడ్‌ పద్దు కింద రూ.10 వేల చొప్పున కేటాయిస్తారు. జిల్లాలో రెండు, మూడు గ్రామాలకు ఒకటి చొప్పున మొత్తం 535 సబ్‌సెంటర్లు ఉన్నాయి. అక్కడ పనిచేసే ఏఎన్‌ఎంలు వాటిని వినియోగించి బిల్లులు సమర్పిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో అభివృద్ధి సంఘం చేసిన తీర్మానాల ప్రకారం నిధులు ఖర్చు చేస్తారు. వైద్యపరికరాలకు చిన్న చిన్న మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఫర్నిచర్‌ రిపేరు, విద్యుత్తు పరికరాల కొనుగోలు లాంటి పనులతోబాటు, రోగులను అత్యవసరంగా ఉన్నత స్థాయి ఆస్పత్రికి తరలించాల్సి వస్తే ఈ నిధులు వినియోగించుకోవచ్చు. వార్షిక సంవత్సరం అంతమయ్యే దశకు వచ్చినా ఈ ఏడాది ఇంతవరకు నిధులు రాకపోవడంతో ఆస్పత్రుల్లో కనీస అవసరాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
Tags: Saukaryalev ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *