Natyam ad

గో ఆధారిత వ్య‌వ‌సాయంతో ప్ర‌పంచాన్ని విష‌తుల్యం నుంచి కాపాడండి

– స్వాతంత్య్ర‌దినోత్స‌వ సందేశంలో రైతుల‌కు టీటీడీ ఈవో పిలుపు

 

తిరుమల ముచ్చట్లు:

 

ర‌సాయ‌న ఎరువులు, పురుగు మందుల‌తో పండిస్తున్న పంట‌లు విష‌తుల్యంగా మారుతూ మాన‌వాళి క్యాన్స‌ర్ లాంటి అనేక భ‌యంక‌ర‌మైన వ్యాధుల‌కు గుర‌వుతోంద‌ని టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచాన్ని ఈ స‌మ‌స్య నుంచి కాపాడ‌టానికి గో ఆధారిత వ్య‌వ‌సాయం దిశ‌గా అడుగులు వేయాల‌ని రైతుల‌కు ఆయ‌న పిలుపు నిచ్చారు. గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించి ఈ ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధ‌ర చెల్లించి కొనుగోలు చేయ‌డానికి టీటీడీ కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు.   76వ స్వాతంత్య్ర దినోత్సవ సంద‌ర్బంగా సోమ‌వారం ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ప‌రేడ్ గ్రౌండ్‌లో జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం ఆయ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అధికారులు, ఉద్యోగుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు.   శ్రీవారి అనుగ్రహంతో కోవిడ్‌ ప్రభావం పూర్తిగా తగ్గి రెండేళ్ల తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి గత వేసవి శెలవులలో దాదాపు రెండునెలలకు పైగా క్యూలైన్లు బారులు తీరడంతో సామాన్య భక్తులకు సేవలందించడంలో దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. ఈ స్ఫూర్తిని రాబోయే బ్ర‌హ్మోత్స‌వాల్లో కూడా కొన‌సాగించాలి.  కరోనా వైరస్‌ను నిర్మూలించి ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ లోకకల్యాణం కోసం రెండున్నరేళ్లుగా నిరంతరాయంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం.  ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా  తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించాం. రెండో విడతగా దాదాపు 1130 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి.

 

 

 

Post Midle

– వేదాలలో గోవును విశ్వ‌మాత‌గా కొనియాడటంచేత టీటీడీ గోసంరక్షణార్థం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటోంది.  ఇందులో భాగంగా  గౌరవ  ముఖ్యమంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు  హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చెయ్యడానికి పెద్ద ఎత్తులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇప్పటివరకు 193 ఆలయాలకు ఆవు, దూడలను  అందించాం. తిరుపతి స్థానిక ఆలయాల్లో మరియు అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్ర‌తి రోజు గోపూజలు ఘనంగా నిర్వహిస్తున్నాం. గోవులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి తిరుపతిలోని గోశాలలో ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ నిర్మాణపనులు డిసెంబ‌రుకు పూర్తి చేస్తాం. శ్రీవారి ఆలయంలో రోజువారీ కైంకర్యాల నిమిత్తం అవసరమయ్యే పాల ఉత్పత్తికిగాను మేలుజాతి గోవుల  సేకరణ ప్రారంభించాం. ఇందుకోసం దాతల నుంచి కూడా సహకారంతో ఇప్ప‌టివ‌ర‌కు 130 దేశావాళి ఆవుల‌ను స‌మీక‌రించాం. తెలుగు రాష్ట్రాలలో గోశాలల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి గోశాలల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాం. వేదాలలో గోవు తర్వాత వ్యవసాయానికి ప్రాముఖ్యత ఉన్నందున నాణ్యమైన ప్రసాదాలను స్వామివారికి నివేదించి శ్రీవారి భక్తులకు పంచడంతో బాటు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ మరియు ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. గో ఆధారిత వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల గోవులు, ఎద్దుల‌ను ఉచితంగా అంద‌చేశాం. గో ఆధారిత వ్య‌వ‌సాయంతో ప‌డ్డించిన 2500 ట‌న్నుల శెన‌గ ప‌ప్పును కిలో రూ.70 చెల్లించి కొనుగోలు చేశాం. మ‌రో 12 ర‌కాల ఎత్ప‌త్తుల‌ను మార్క్‌ఫెడ్ ద్వారా సేక‌రిస్తాం. భ‌విష్య‌త్తులో టీటీడీ ఉప‌యోగించే ఆహార ఉత్ప‌త్తుల‌న్నీ గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన‌వే ఉంటాయి. మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం ద్వారానే వండే ఏర్పాటు చేస్తాం.

 

 

 

–   ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమాలను ఎస్వీబిసి ద్వారా ప్రసారణం చేయడం ద్వారా భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. హైందవ సాంప్రదాయాల పట్ల, సనాతన ధర్మం పట్ల యువతలో అవగాహన కల్పించాలనేదే  ఈ కార్యక్రమాలయొక్క ప్రధాన ఉద్దేశం.  గత  రెండున్నరేళ్లుగా  ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు కోట్లాది మంది భక్తుల నుండి  అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శ్రీమద్భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి అర్థ, తాత్పర్య, సారాంశాలను కూలంకషంగా అందించడంద్వారా దేశంలోనే కాకుండా విదేశాలలో ఉండే భారతీయులు సైతం ఈ కార్యక్రమం ద్వారా ప్రభావితులైనట్లు ఈమెయిల్‌, ఎస్ఎమ్ఎస్, ఉత్తరాల ద్వారా తెలియచేయ‌డం ముదావహం.  శ్రీమద్భగవద్గీతలో పరమాత్మ యోగశాస్త్రం గురించి ప్రత్యేకంగా ఉపదేశించియున్నారు కనుక ఈ కార్యక్రమానికి అనుబంధముగా ఇప్పుడు యోగదర్శన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. ఇది కోట్లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటుంది.   పురాణ, ఇతిహాసాల సారాంశాన్ని ప్రతి ఒక్కరికీ అందజేయాలనే సదుద్దేశ్యంతో శ్రీమద్రామాయణంలోని సుందరాకాండను పూర్తిచేసి బాలకాండ ప్రారంభించాము. అలాగే మహాభారతంలోని విరాటపర్వం పూర్తిచేసి, ఆదిపర్వాన్ని ప్రారంభించాము. మ‌హాభార‌తంలోని ల‌క్ష‌శ్లోకాల‌ను ప్ర‌తి భ‌క్తుడి నోట ప‌లికించేందుకు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతంది. అలాగే వ్యాస మ‌హ‌ర్షి ర‌చించిన గ‌రుడ పురాణాన్ని కూడా త్వ‌ర‌లో అందిస్తాం. హిందూ ధర్మప్రచారంలో భాగంగా సప్తగిరి మాసపత్రికను 5 భాషల్లో నెలకు 2.10 లక్షల కాపీలు ముద్రించి భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశాం. అలాగే 2023వ సంవత్సరానికి సంబంధించి 8 రకాల క్యాలెండర్లు, డైరీలు మొత్తం కలిపి 33 లక్షల ప్రతులు ముద్రించాలని నిర్ణయించాం.

 

– అధ‌ర్వ వేదానికి ఉప వేదంగా చెప్పబడే ఆయుర్వేదాన్ని బలోపేతంచేయాలనే ఉద్దేశ్యంతో  టిటిడి ఆయుర్వేద ఫార్మసీలో మరో 100 రకాల ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్‌ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు గతేడాది ప్రారంభించబడిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 500కు పైగా ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపి పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. ఆఫ్రికా, బాంగ్లాదేశ్ వంటి దేశాల‌నుండి కూడా ఇక్క‌డికి వ‌చ్చి విజ‌య‌వంతంగా గుండె శ‌స్త్ర‌చికిత్స‌లు చేయించుకుని వెళ్ళ‌డం సంతోషం.- చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గతేడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భూమిపూజను నిర్వహించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఆసుప‌త్రి నిర్మాణానికి కోటి రూపాయ‌ల విరాళం ఇచ్చే ప్ర‌తి దాత‌కు ఉద‌యాస్త‌మాన సేవా టికెట్ ఇస్తున్నాము. ఇప్ప‌టివ‌ర‌కు 130 మంది దాత‌లు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకున్నారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబులిటీ (సి.ఎస్‌.ఆర్‌) ద్వారా విరాళం అందించినా ఈ అవ‌కాశం ల‌భిస్తుంది. దాత‌లు విరివిగా విరాళాలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందాలి.- మహిళల ప్రసూతి కాన్పు సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఏర్పడిన సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే చిన్నపిల్లలకు బర్డ్‌ ఆసుపత్రిలో తగిన వైద్యం, శిక్షణ అందించి వారిని పూర్తిస్థాయి వికాసవంతులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. అధునాత‌న ఎక్స్‌రే, సిటి స్కాన్ ఇత‌ర ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చాం.   తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి వంద కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబరు 14న ప్రారంభించాం. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేసి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తాం. విశాఖపట్నం, భువనేశ్వర్‌, అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఇటీవల ప్రారంభించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించాం. అలాగే  చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం,             ఉలందూరు పేట, సీతంపేట, రంపచోడవరంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జ‌న‌వ‌రి 15వ తేదీ త‌రువాత వీటిని ప్రారంభిస్తాం.

 

– ముంబయిలో స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నవీముంబయిలోని ఉల్వే ప్రాంతంలో 10 ఎకరాల భూమిని ఇటీవలే టిటిడికి అప్పగించింది. రేమండ్‌ కంపెనీ అధినేత శ్రీ గౌతమ్‌ సింఘానియా రూ.70 కోట్లతో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి  ముందుకు వచ్చారు. ఆలయ నిర్మాణానికి ఈ నెల 21వ తేదీ భూమిపూజ నిర్వహిస్తాం. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం వద్ద ఆరాధన కేంద్రం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించాం. రాంకీ సంస్థ అధినేత శ్రీ అయోధ్య రామిరెడ్డి రూ.5 కోట్లతో ఈ కేంద్ర నిర్మాణానికి ముందుకు వచ్చారు. వరదలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ మాన్యువల్‌ను రూపొందిస్తున్నాం. ఇందుకోసం కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించి ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. బెంగుళూరుకు చెందిన శ్రీ కొట్టు ముర‌ళీకృష్ణ‌ సుమారు 23 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన పరకామణి భవనం అధునాతనమైన సౌకర్యాలతో సెప్టెంబ‌రు 28వ తేదీ అందుబాటులోకి రానున్నది. అలాగే టాటా ట్ర‌స్టు సహాయంతో తిరుమలలోని మ్యూజియంలో పలు గ్యాలరీలను ఏర్పాటు చేయబోతున్నాము. ఇందులో భాగంగా శ్రీవారి సేవల విశేషాలను, ఉత్సవాల వివరాలను,  అరుదైన శ్రీవారి ఆభరణాల నమూనా చిత్రాలను 3డి రూపంలో పొందుపరచి భక్తుల వీక్షణానికి అందుబాటులో ఉంచబోతున్నాము.

 

 

 

– జిఎంఆర్‌, శ్రీసిటి, ఫీనిక్స్‌ ఫౌండేషన్‌, లార‌స్ ల్యాబ్స్ ఇతర దాతల సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి తిరుమల పరిసరాలను ఇహలోక వైకుంఠంలా  తీర్చి దిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాము. ఇప్పటికే పాస్టిక్‌ నిషేధంలో సఫలమైన టీటీడీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకు తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నాం. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల తాగునీటి అవసరాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజు వేఘ్నేశ ట్ర‌స్టు తిరుమ‌ల‌లో సుమారు 150 ఆర్‌వో ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేసింది. భ‌క్తులు తిరుమ‌ల‌కు రాగి, గాజు, స్టీల్ బాటిళ్ల‌ను మాత్ర‌మే తిరుమ‌ల‌కు తీసుకురావాలి. తిరుమ‌ల‌లో గాజు వాట‌ర్ బాటిళ్ళ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటాం.     టీటీడీ నిర్వహిస్తున్న‌35 విద్యాసంస్థల్లో 19,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం. విద్యార్థుల్లో మానవీయ, నైతిక విలువలు పెంపొందించేందుకు చిన్మయ మిషన్‌, రామకృష్ణ మిషన్‌, ఇస్కాన్‌ సంస్థల సహకారంతో చక్కటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇటీవల శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలకు న్యాక్‌ ఎ ప్లస్‌ గ్రేడ్‌ గుర్తింపు లభించింది. ఇందుకు కృషి చేసిన జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ప్రిన్సిప‌ల్‌, అధ్యాప‌కులు, సిబ్బందికి నా అభినంద‌న‌లు. అలాగే తిరుమ‌ల ఎస్వీ హైస్కూల్‌లో విద్యాభోద‌న‌కు రేమండ్స్ ట్ర‌స్టు ముందుకు వ‌చ్చింది. దీంతో పాటు తిరుప‌తిలోని మ‌రో మూడు స్కూళ్ళ‌లో చ‌దువుతున్న సుమారు 2 వేల మంది విద్యార్థుల‌కు కూడా మెరుగైన సౌక‌ర్యాల‌తో విద్యా భోద‌న అందించ‌డానికి రేమండ్స్ సంస్థ అంగీక‌రించింది.   టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి పలు ఇన్సూరెన్స్‌ సంస్థలు, ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ఉద్యోగుల‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు 200 డిఎ కేసుల‌ను త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తాం.

 

– టిటిడిలో సొసైటీలు, ఏజెన్సీలు, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 7,260 మందికి ఉద్యోగభద్రత కల్పించడం కోసం ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శ్రీ లక్ష్మీశ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. దశలవారీగా వీరిని కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోంది. కొంత మంది అవ‌గాహ‌న లేక కార్పొరేష‌న్‌లో ఉద్యోగ భ‌ద్ర‌త లేద‌ని అనుకుంటున్నారు. ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌తో స‌మానంగా పే స్కేల్‌, ఇత‌ర అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తాం. క‌ర్పొరేష‌న్‌లో చేరే ఉద్యోగుల‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంది.   స్విమ్స్‌లో చదువుతున్న ఫిజియోథెరపీ, పారామెడికల్‌, నర్సింగ్‌ విద్యార్థులకు టిటిడి విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందిస్తున్న విధంగా ఉచిత భోజన వసతి కల్పించ‌డానికి టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. స్విమ్స్‌లోని క్యాంటీన్లన్నీ అభివృద్ధి చేసి రోగులు, రోగుల సహాయకులు, డాక్టర్లు, ఇతర సిబ్బందికి రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. రోగుల సహాయకుల కోసం కొత్త భ‌వ‌నం నిర్మిస్తాం.  కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి యావత్‌ ప్రపంచానికి ఆరోగ్యం, శాంతిసౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను…ఈ కార్య‌క్ర‌మంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, డిఎల్‌వో   రెడ‌ప్ప‌రెడ్డి, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబిసి   ష‌ణ్ముఖ కుమార్‌,  సిఏవో   శేష‌శైలేంద్ర‌, అద‌న‌పు సివిఎస్వో   శివ‌కుమార్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags: Save the world from toxicity with Go-based farming

Post Midle

Leave A Reply

Your email address will not be published.