రోజు రోజుకు మారుతున్న సీన్

 Date:12/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
105 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేసుకున్నాకే, తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసిన టీఆర్‌ఎస్‌ అధినేత, అత్యంత వ్యూహాత్మకంగానే ముందడుగు వేశారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇవ్వడం ద్వారా, ‘గెలిచేస్తాం..’ అన్న నమ్మకాన్ని ఆయన బయటపెట్టారు. అదే తమకు ‘పాజిటివ్‌ ఓటింగ్‌’ తెచ్చిపెడ్తుందన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల భావన. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన టిక్కెట్లను మార్చే ప్రసక్తే లేదు..’ అని మంత్రి కేటీఆర్‌ చెబుతుండడమూ, ఆ ‘పాజిటివ్‌ ఓటింగ్‌’ పోకూడదనే.కానీ, నిజంగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ఆ పాజిటివ్‌ ఓటింగ్‌ దక్కుతుందా.? సిట్టింగ్‌లు అందరూ గెలిచేస్తారా.? అంటే, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే పనిచేస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
ఆ మాటకొస్తే, అధికార పార్టీకి చెందిన నేతలే పది నుంచి పాతికమంది వరకు సిట్టింగ్‌లు ఓడిపోవచ్చని ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటుండడం గమనార్హం. గ్రేటర్‌ పరిధిలోనే ఎక్కువమంది సిట్టింగ్‌లకు దెబ్బ తగలనుందన్న అంచనాలు ఆసక్తికరమే.సెంచరీ కొట్టేస్తాం.. అని గతంలో చెప్పిన కేసీఆర్‌, ఆ తర్వాత 100 గెలిచేస్తామని ప్రకటించేశారు. ఆ స్థాయిలో కేసీఆర్‌ అండ్‌ టీమ్‌, ‘మేనేజ్‌’ చేస్తోందిగానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వుంటాయని గులాబీ బాస్‌కి మాత్రం తెలియదని ఎలా అనుకోగలం.? తాజా అంచనాల ప్రకారం, టీఆర్‌ఎస్‌ మరోమారు అధికార పీఠమెక్కడం ఖాయమనీ, అయితే కేసీఆర్‌ చెబుతున్న బంపర్‌ మెజార్టీ అయితే కష్టమనీ, గత ఎన్నికల కంటే ఒకటో రెండో తక్కువే సీట్లు రావొచ్చనీ ప్రచారం జరుగుతోంది.
ఈ లెక్కలు, అంచనాలు ఎలా వున్నా, అంతిమ తీర్పు కౌంటింగ్‌ రోజునే తేలుతుంది. ఈలోగా ఎవరి అంచనాలు వారివి.. ఎవరి వ్యూహాలు వారివి. ‘తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి చేతకానితనాన్ని బయటపెట్టుకున్నాం..’ అన్న భావన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోందంటే, కేసీఆర్‌ డెసిషన్‌ ఎంత ‘రాంగ్‌’ అనేది చెప్పకనే చెబుతోంది. కానీ, కేసీఆర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం ఎవరు మాత్రం చేయగలరు. ఏదిఏమైనా, మహాకూటమిపై వ్యతిరేకత మాత్రమే.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌పై సానుకూల పవనాలుగా మారాలన్నమాట. మహాకూటమి విఫల కూటమి అవుతుందా.? కేసీఆర్‌ చెబుతున్నట్లు అది కాలకూట విషంగా తెలంగాణ ప్రజలు భావిస్తారా.? లేదంటే, మార్పుకి తెలంగాణ ప్రజలు ఓటేస్తారా.? వేచి చూడాల్సిందే.
Tags:Scene changing day by day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *