కడుపులో కత్తెర-ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకం
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు సిజేరియన్ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అంత వరకు బాగానే ఉన్నా, ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అయితే, అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది.. ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది .. ఆ ఎక్స్రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.. దీంతో, షాక్ తిన్న ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు. మరోవైపు.. ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి వివరాలు కూడా మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వైద్యులపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Tags; Scissors in Stomach – Administered by Government Hospital Doctors

